Andhra Pradesh: ఈసీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ... సర్వత్ర ఉత్కంఠ!
- నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
- ఇంతవరకూ ఏర్పాట్లు చేయని అధికారులు
- నామినేషన్లు వేస్తామంటున్న టీడీపీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, ఇంతవరకూ నోటిఫికేషన్ వెలువడిన ఏ ప్రాంతంలో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరగలేదని తెలుస్తోంది. నేడు నామినేషన్లు వేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేయగా, వాటిని స్వీకరించేందుకు కూడా అధికారులు అందుబాటులో లేరని సమాచారం. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఈ ఉదయం 9 గంటలలోపే ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎన్నికలను సజావుగా జరిపించేందుకు సంబంధిత అన్ని వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం సహకరించేందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వంతో పాటు, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది. ఇదే సమయంలో గత సంవత్సర కాలంలో మైనారిటీ తీరిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించిన తరువాత మాత్రమే ఓటింగ్ నిర్వహించాలని మరో పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉండగా, విచారణ తరువాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. కాగా, అందుబాటులో ఎవరు ఉన్నా వారికి నామినేషన్లు ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రిటర్నింగ్ అధికారులు బాధ్యతలు తీసుకోకపోతే, ఆ భాధ్యత ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దేనని ఆ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు.