India: ఫ్యాన్స్ కు గేట్లు తెరుద్దాం... కేంద్రాన్ని కోరుతున్న బీసీసీఐ!

  • ఇండియాలో త్వరలో ఇంగ్లండ్ టూర్
  • అభిమానులను అనుమతించాలంటున్న బీసీసీఐ
  • కేంద్రంతో సంప్రదింపులు
  • కనీసం 50 శాతం ప్రేక్షకులను అనుమతించే చాన్స్
BCCI Wants to Allow Fans for Upcoming England Series

గత సంవత్సరం మార్చి నుంచి క్రికెట్ ను ఎంతో అభిమానించే భారతీయులకు కరోనా కారణంగా ఇంతవరకూ ఒక్క మ్యాచ్ ని కూడా ప్రత్యక్షంగా తిలకించే అదృష్టం పట్టలేదు. ఇప్పుడిప్పుడే క్రీడలు జోరందుకుంటుండగా, పలు దేశాలు పరిమిత సంఖ్యలోనైనా ఫ్యాన్స్ ను అనుమతిస్తున్నాయి. ఇటీవల ముగిసిన భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ లో సైతం స్టేడియం కెపాసిటీని అనుసరించి, ప్రేక్షకుల మధ్య భౌతిక దూరం ఉండేలా ప్రేక్షకులను అనుమతించారు.

ఇక త్వరలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తున్న బీసీసీఐ, ఈ మేరకు అనుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించింది. ఇరు జట్ల మధ్యా జరిగే ద్వైపాక్షిక టీ-20 పోటీలకు కనీసం 50 శాతం ఫ్యాన్స్ ను అనుమతించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించిన బోర్డు అధికారి, ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని, వారు రిస్క్ లో పడకుండా చూడటంతో పాటు, అభిమానులను కూడా అనుమతించాలన్నది తమ ఉద్దేశమని అన్నారు.

ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు చేసిన తరువాత బయో బబుల్ లోకి పంపుతామని, అక్కడి నుంచి వారంతా ఆంక్షల మధ్య ఉండాల్సి వుంటుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ లతో పాటు టీ-20 సీరీస్ ను కూడా ఆడనుంది. నాలుగో టెస్ట్ మార్చి 8తో ముగుస్తుంది. ఆపై టీ-20 సిరీస్ మొదలవుతుంది.

అహ్మదాబాద్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న సర్దార్ పటేల్ మొతేరా స్టేడియంలో 1.10 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్ ని తిలకించే వీలుంటుంది. ఇక్కడే టీ-20 మ్యాచ్ లన్నీ జరుగుతాయి. కనీసం 50 శాతం ప్రేక్షకులను అనుమతించినా, 55 వేల మందికి ప్రత్యక్ష వీక్షణం లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా, టెస్ట్ మ్యాచ్ లు మాత్రం ఫ్యాన్స్ లేకుండానే జరుగనున్నాయి. తొలి రెండు టెస్టులూ చెన్నైలో జరగనుండగా, టికెట్లు అమ్మరాదన్న ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి.

More Telugu News