Pakistan: 2జీ యాప్ లతో సంభాషణలు... కశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ!

  • ఇంటర్నెట్ స్లోగా ఉన్నా పనిచేసే యాప్ లు
  • వాట్సాప్, మెసెంజర్ లను వదిలేసిన ఉగ్రవాదులు!
  • మూడు కొత్త యాప్ లతో కార్యకలాపాలు
  • యాప్ లను అడ్డుకునేందుకు సైన్యం ప్రయత్నాలు
Pakistan uses new apps that can work with lower data speeds

రెండేళ్ల కిందట కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం అదే సమయంలో విద్వేషాలు మరింత ప్రబలకుండా అక్కడ ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. గతేడాది ప్రారంభంలో 2జీ వేగంతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రవాదులు కూడా అందుకు అనుగుణంగా తమ ఎత్తుగడలను మార్చుకున్నారు. వాట్సాప్, మెసెంజర్ వంటి ఆధునిక యాప్ లకు భిన్నంగా 2జీ వేగంతోనూ నిరాటంకంగా పనిచేసే 3 కొత్త యాప్ లను వినియోగిస్తున్నారు.

వాటిలో ఒకటి అమెరికాకు చెందిన యాప్ కాగా, మరొకటి యూరప్ కు, ఇంకొకటి టర్కీకి చెందిన యాప్ అని అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన కొన్ని ఎన్ కౌంటర్లు, అరెస్టుల ద్వారా లభ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నూతన యాప్ లను ఉపయోగిస్తున్న విషయం తెలుసుకున్నారు. అయితే ఈ మూడు యాప్ ల పేర్లను మాత్రం భద్రతా కారణాల రీత్యా అధికారులు వెల్లడించలేదు. ఈ మూడు యాప్ లు తక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్లపై కూడా అవాంతరాల్లేకుండా పనిచేయడాన్ని భారత సైన్యం గుర్తించింది.

2000వ దశకం ఆరంభంలో ఉన్న ఎడ్జ్ టెక్నాలజీ, లేక, 2జీ డేటా స్పీడ్ లపైనా పనిచేసే ఈ యాప్ లు ఇంటర్నెట్లో ఉచితంగానే లభిస్తాయి. ఈ యాప్ ల సాయంతో కశ్మీర్ యువతను ఉగ్రవాదం దిశగా ఆకర్షించేందుకు పాక్ టెర్రరిస్టు గ్రూపులు ప్రయత్నిస్తున్న వైనం ఇటీవల వెల్లడైంది. ప్రస్తుతం ఈ మూడు యాప్ లను జమ్మూ కశ్మీర్ లో బ్లాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News