Roja: సీఎం జగన్ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదు... ప్రజల ప్రాణాల కోసమే ఆయన ఆలోచిస్తున్నారు: రోజా
- పంచాయతీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వైసీపీ సర్కారు
- సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ విమర్శనాస్త్రాలు
- సీఎం జగన్ దమ్మున్న వ్యక్తి అంటూ రోజా వ్యాఖ్యలు
- చంద్రబాబుకు సిగ్గుంటే ఇలాంటి ప్రచారం చేయరని ఆగ్రహం
ఏపీలో పంచాయతీ ఎన్నికలను జగన్ సర్కారు వ్యతిరేకిస్తుండడం పట్ల ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్పందించారు. సీఎం జగన్ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదని, ఆయన చాలా ఎన్నికలు చూశారని వెల్లడించారు. జగన్ దమ్మున్న వ్యక్తి అని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచిస్తూ ఎన్నికలకు వెళ్లాలనుకోవడంలేదని స్పష్టం చేశారు.
అయితే తామేమీ పూర్తిగా ఎన్నికలు రద్దు చేయాలని కోరడం లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు వ్యాధి నిరోధక శక్తి పొందితే అప్పుడు ఎన్నికలు జరిపితే బాగుంటుందని సీఎం జగన్ భావిస్తున్నారని, అందుకే పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని అంటున్నారని రోజా వివరించారు.
చంద్రబాబునాయుడికి నిజంగా సిగ్గు, మానం ఉంటే ఇలాంటి ప్రచారం చేయడని మండిపడ్డారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, కానీ దమ్ము, ధైర్యంలేని చంద్రబాబు ఎన్నికలు నిర్వహించకుండా పారిపోయారని విమర్శించారు. ఇవాళ జగన్ కు దమ్ము లేదని మీరు మాట్లాడితే చిన్నపిల్లలు కూడా నవ్వే పరిస్థితి వస్తుందని అన్నారు.
ఒకవేళ న్యాయస్థానం ఎన్నికలు జరపాలని తీర్పు ఇస్తే తాము శిరసావహిస్తామని రోజా స్పష్టం చేశారు. అయితే నిమ్మగడ్డ లాగా అధికారపక్షంతో విభేదిస్తూ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్న ఎస్ఈసీ మరొకరు ఉండరని విమర్శించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోనే ఇలా జరుగుతోందంటే, అందుకు కారకులు ఎవరో, ఎస్ఈసీ వెనకున్న వాళ్లెవరో గుర్తించి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు.