Ravichandran Ashwin: ఆసీస్ పై సిరీస్ నెగ్గడంలో టిమ్ పైన్ సాయం మరువలేం... అశ్విన్ వ్యంగ్యం
- సిడ్నీ టెస్టులో అశ్విన్, పైన్ మధ్య మాటలయుద్ధం
- బ్రిస్బేన్ రా చూసుకుందాం అంటూ పైన్ సవాలు
- నువ్వు భారత్ వస్తే నీకదే ఆఖరి సిరీస్ అంటూ అశ్విన్ ప్రతిసవాలు
- పంత్ ను అవుట్ చేసే చాన్స్ మిస్ చేసి తమకు పైన్ మేలు చేశాడన్న అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మైదానంలోనే కాదు యూట్యూబ్ లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆసక్తికరమైన వీడియోలతో అభిమాలను అలరించే ఈ తమిళ తంబి తాజాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తో చాట్ చేసిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ పై అశ్విన్ వ్యంగ్యం ప్రదర్శించాడు.
ఆసీస్ పై టీమిండియా టెస్టు సిరీస్ ను గెలుచుకోవడం వెనుక టిమ్ పైన్ సాయం కూడా ఉందని అన్నాడు. బ్రిస్బేన్ టెస్టులో అతడు చేజార్చిన అవకాశాలు తమ విజయానికి బాటలు వేశాయని వివరించాడు. రెండో ఇన్నింగ్స్ లో పంత్ ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడిచాడని, ఆ పొరపాటే తమను గెలిపించిందని అశ్విన్ వివరించాడు. అందుకే పైన్ అంటే తనకు ఇష్టమని ఎద్దేవా చేశాడు.
అంతకుముందు సిడ్నీ టెస్టులో అశ్విన్, టిమ్ పైన్ మధ్య స్లెడ్జింగ్ చోటుచేసుకుంది. బ్రిస్బేన్ కు రా చూసుకుందాం అని పైన్ సవాలు విసరగా, నువ్వు భారత పర్యటనకు వస్తే అదే నీకు ఆఖరి సిరీస్ అవుతుంది అని అశ్విన్ ప్రతిసవాలు విసిరాడు. దీనిపైనా అశ్విన్ ఛలోక్తి విసిరాడు. బ్రిస్బేన్ వస్తే చూసుకుందాం అని పిలిచి అతడే స్టంపింగ్ చాన్స్ మిస్ చేశాడు... మరోలా చెప్పాలంటే మా సిరీస్ విజయానికి అతడే కారకుడు అని వివరించాడు.