India: విమానాశ్రయాల్లో పట్టుబడే అక్రమ బంగారం, వస్తువులను ఏం చేస్తారు?... అవాక్కయ్యే సమాధానం ఇచ్చిన అధికారులు!

  • అక్రమంగా వచ్చే బంగారం, వజ్రాలు
  • స్వాధీనం చేసుకునే కస్టమ్స్ అధికారులు
  • ఆపై సమాచారం తమకు తెలియదని సమాధానం 
  • ఏమవుతున్నాయని ప్రశ్నించిన స.హ చట్టం కార్యకర్త
Gold Seased by Customs in Airport What Happen After Next no Information

హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, ముంబై... ఎయిర్ పోర్టులు ఏవైనా, నిత్యమూ అరబ్ దేశాల నుంచి, మలేషియా, సింగపూర్ ల నుంచి పన్నులు కట్టకుండా అక్రమంగా తీసుకుని వచ్చే బంగారం పట్టుబడుతుందన్న సంగతి తెలిసిందే. కోట్ల కొద్దీ విలువైన బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు వివిధ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, కేసులు పెడుతూ ఉంటారు. ఇలా ట్యాక్స్ కట్టకుండా బంగారం, విలువైన వస్తువులు తెస్తే, వారిపై కేసు పెట్టి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తుంటారు కూడా. ఆపై ఆయా వస్తువులపై సరైన లెక్కలు చెబితే, వాటిని వెనక్కిచ్చేస్తుంటారు.

ఒకవేళ వాటిని అక్రమంగా తీసుకుని వస్తే మాత్రం స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, ఇతర వస్తువులు కస్టమ్స్ అధీనంలోనే ఉంటాయి. వాటిని ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా? దీనికి కస్టమ్స్ అధికారుల వద్ద కూడా సమాధానం లేదు. వాటిని ఎక్కడ ఉంచుతారు? తదుపరి ఏం చేస్తారు? ఇందుకు సంబంధించిన కనీస సమాచారం కూడా వారి వద్ద లేకపోవడం గమనార్హం.

ఈ విషయం ఎలా తెలిసిందంటారా? హైదరాబాద్ కు చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త పలు ప్రశ్నలను సంధిస్తూ, కస్టమ్స్ అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సమాధానం వచ్చింది. అయితే, ఆ సమాధానం చదివిన ఆ కార్యకర్త మాత్రం అవాక్కయ్యాడు. ఇంతకీ సమాధానం ఏంటో తెలుసా?... "మా వద్ద సమాచారం లేదు" అని.

ఇంకొన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన రాబిన్ అనే స.హ చట్టం కార్యకర్త, 9 ప్రశ్నలను సంధించాడు. 2015 నుంచి 2020 వరకూ కస్టమ్స్ శాఖ స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు ఏంటి? ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ పరికరాలను ఏం చేస్తారు? హైదరాబాద్ కస్టమ్స్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? వీటిని వేలం వేస్తారా? వేస్తే వాటిని కొనుగోలు చేసింది ఎవరు? ఈ సమాచారాన్ని ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గడచిన పది వేలాల గురించి చెప్పండి? ప్రస్తుతం ఎన్ని వస్తువులు కస్టడీలో ఉన్నాయి? వాటిల్లో ఎన్నింటిని కోర్టులకు అప్పగించారు? అంటూ ప్రశ్నించారు.

ఇటీవల తమిళనాడు సీబీఐ కస్టడీలో ఉన్న దాదాపు 100 కేజీల బంగారం మాయమైందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాధీనం చేసుకున్న వస్తువులపై రాబిన్ ప్రశ్నలు స్పందించారు. అయితే, కస్టమ్స్ అధికారులు మాత్రం, తమకు ఏమీ తెలియదని అధికారికంగా సమాచారం ఇవ్వడంతో వాపోయిన రాబిన్, ఈ వస్తువుల నిర్వహణ సక్రమంగా లేదని, బంగారం, వజ్రాలు, వెండి, విలువైన వస్తువుల రికార్డులను ఎవరూ నిర్వహించడం లేదని తేలిందని చెబుతూ, వాటి వివరాలు ఏంటని నిలదీశాడు.

More Telugu News