Mamata Banerjee: పిలిచి అవమానిస్తారా? నరేంద్ర మోదీ ముందే మమతా బెనర్జీ ఆగ్రహం!

  • మమత ప్రసంగానికి ముందు జై శ్రీరామ్ నినాదాలు
  • ఇదేమీ రాజకీయ సభ కాదని మమత ఆగ్రహం
  • తాను ప్రసంగించబోనని వెళ్లిపోయిన వైనం
  • మమతను సోదరిగా సంబోధించిన ప్రధాని
Mamata Angry Over Jai Shriram Chants

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించిన వేళ, నిర్వహించిన సభలో మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందే తనలోని అసంతృప్తిని తెలియజేస్తూ, ప్రసంగించేందుకు నిరాకరించారు నేతాజీ జయంతి సందర్భంగా విక్టోరియా మెమోరియల్ కార్యక్రమం జరుగుతున్న వేళ, మమతా బెనర్జీ ప్రసంగించడానికి ముందు సభలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, ఇదేమీ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఇక్కడ గౌరవంగా ఉండాలని సభకు హాజరైన వారికి హితవు పలికారు. తనను పిలిచి అవమానిస్తారా? అంటూ మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆపై తాను ప్రసంగించబోనని చెబుతూ, కార్యక్రమానికి హాజరైన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి వేదికపై నుంచి వెళ్లిపోయారు. ప్రధాని, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కార్ వేదికపై ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకుముందు సభలో నినాదాలు చేస్తున్న వారిని పదేపదే అధికారులు వారించడం వీడియోలో కనిపించింది. ఈ నినాదాల కారణంగా మమతా బెనర్జీ ఒకింత అసంతృప్తికి గురైనట్టు కనిపించారు ఆమె కూడా సభికులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

ఆపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, మమతా బెనర్జీని తన సోదరిగా అభివర్ణిస్తూ, ప్రసంగించారు. ఈ సభలో భరతమాతను తలచుకోవడం ముదావహమేకానీ, శ్రీరాముడిని తలచుకునే సందర్భం ఇది కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార తృణమూల్, అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

More Telugu News