UK: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌పై బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన

  • గతేడాది వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్
  • పాత వైరస్ కంటే 30 శాతం ప్రాణాంతకం
  • ప్రతి  1000 మందిలో 13 మంది మృతి
Corona New Strain Is More Dangerous Than Old Virus

యూకేలో గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌పై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. గత వైరస్‌తో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతూ, మరింత ప్రాణాంతకంగా ఉందని పేర్కొన్నారు. కొత్త స్ట్రెయిన్ తర్వాత మరణాల రేటు పెరిగినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫైజర్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

పాత కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్ మరింత ప్రమాదకారి అన్న విషయంలో తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్ వ్యాలన్స్ ధ్రువీకరించారు. అయితే, ఈ విషయంలో మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు.

ప్రస్తుతం అందిన సమాచారాన్ని బట్టి పాత వైరస్‌ సోకిన ప్రతి వెయ్యి మందిలో 10 మంది చనిపోతే, ఈ కొత్త వైరస్ కారణంగా 13 మంది చనిపోయారన్నారు. అంటే, పాతదానితో పోలిస్తే ఇది 30 శాతం అధిక ప్రాణాంతకమని అన్నారు. కరోనా నిబంధనలు మరికొన్ని రోజులు పాటిస్తే వైరస్ ముప్పు తగ్గుతుందని అన్నారు.

More Telugu News