Farm Laws: రైతు సంఘాల నేతలను చంపే కుట్ర.. పోలీసులే తనకు ఈ పని అప్పజెప్పారన్న పట్టుబడిన నిందితుడు!

  • 26న రైతుల్లో దూరి కాల్పులకు కుట్ర
  • రైతులు నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ పాల్గొన్న నిందితుడు
  • పట్టుబడిన వ్యక్తి రాయ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ ప్రదీప్‌గా ప్రచారం
  • కాదంటూ ఖండించిన పోలీసులు
  • రైతు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర
Farmers at Singhu Border nab masked man assigned to shoot 4 farm leaders

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలను హతమార్చేందుకు పన్నిన కుట్ర బహిర్గతమైంది. సింగు సరిహద్దులో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని రైతులు పట్టుకుని నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురు రైతు సంఘం నాయకులను కాల్చి చంపేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసిన విషయం అతడి ద్వారా బయటకు వచ్చింది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ముఠా సభ్యుల్లో కొందరు పోలీసు యూనిఫాం  ధరించి ఈ నెల 26న రైతులు తలపెట్టిన ర్యాలీని చెదరగొట్టాలని పథకం వేశారు. అలాగే, మరికొందరు రైతుల్లో కలిసిపోయి నేతలపై కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నట్టు పట్టుబడిన వ్యక్తి వెల్లడించాడు. తన పేరు ప్రదీప్ అని, రైతుల నిరసనకు అంతరాయం కలిగిస్తే ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని చెప్పారని తెలిపాడు. ఇందులో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. గతరాత్రి రైతులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడు వారి పక్కనే కూర్చోవడం గమనార్హం.

 ఓ పోలీసు అధికారే తమను ఈ పనికి పురమాయించాడని, రైతు నేతల ఫొటోలు కూడా ఇచ్చాడని నిందితుడు తెలిపాడు. తాను ఈ నెల 19 నుంచి ఇక్కడే ఉన్నానని, ఆందోళనకారుల వద్ద ఏవైనా ఆయుధాలు ఉన్నాయా? అని చూడడమే తన విధి అని చెప్పాడు. ‘‘ఈ నెల 26న మా సభ్యుల్లో కొందరు రైతుల్లో కలిసిపోతారు. వారు కనుక పరేడ్‌కు సిద్ధమైతే వారిపై కాల్పులు జరపాలని మాకు చెప్పారు’’ అని వివరించాడు.

26న రైతులకు పోలీసులు తొలుత హెచ్చరికలు జారీ చేస్తారని, వారు కనుక వినకుండా ర్యాలీకి ముందుకొస్తే ప్లాన్ అమలు చేయాలని, తొలుత మోకాళ్లపై కాల్చాలని,  ఆపై తమ ముఠాలోని 10 మంది వెనకనుంచి కాల్పులు జరుపుతారని వివరించాడు. మొత్తంగా రైతులే ఈ ఘటనకు పాల్పడేలా చేయాలనేదే తమ ప్రణాళిక అని తెలిపాడు.

తాము ఓ అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆరోపించడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూశారని బీకేయూ నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ అన్నారు. నిందితుడు తొలుత తమ వద్ద ఆయుధాలు ఉన్నాయో, లేవో చూడాలన్న పనినే తమకు అప్పగించారని చెప్పాడని, గట్టిగా నిలదీస్తే కుట్రను బయటపెట్టాడని తెలిపారు.  

ఢిల్లీ పోలీసులు మాత్రం ముసుగు వ్యక్తులపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. అలాగే, ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా, పట్టుబడిన నిందితుడిని రైతులు హర్యానా పోలీసులకు అప్పగించారు. వారు అతడిని కుండ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. కాగా, నిందితుడు ప్రదీప్ రాయ్ పోలీస్ స్టేషన్.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. రాయ్ పోలీస్ స్టేషన్‌లో ఆ పేరుతో ఎవరూ లేరని పేర్కొన్నారు.

More Telugu News