South Africa Strain: యాంటీబాడీల నుంచి తప్పించుకునే దక్షిణాఫ్రికా రకం కరోనా!

  • అనేక ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్
  • బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్లు
  • దక్షిణాఫ్రికా రకం స్ట్రెయిన్ పై తాజా అధ్యయనం
  • మళ్లీ సోకే అవకాశాలు ఎక్కువన్న పరిశోధకులు
Researchers say South African variant of corona may cause to reinfection

కరోనా వైరస్ భూతం వ్యాప్తి ప్రారంభమై ఏడాది దాటింది. చైనాలోని వుహాన్ లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ఇతర దేశాలకు పాకడమే కాదు, అనేక విధాలుగా రూపాంతరం చెందింది. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన ఈ వైరస్ మహమ్మారి ఇటీవల బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ యాంటీబాడీల నుంచి కూడా తప్పించుకుంటుందని, ఓసారి కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ సోకే అవకాశాలు దక్షిణాఫ్రికా కరోనా వల్ల అధికంగా ఉంటాయని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది.

జన్యు మార్పులకు లోనైన కరోనా వైరస్ రకాలు మొదటితరం కరోనాతో పోల్చితే అధిక వేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. వీటిల్లో దక్షిణాప్రికా రకం కరోనా క్రిములు సంక్లిష్టమైనవని, ఓసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కూడా మళ్లీ కరోనా బారినపడేలా చేయగలవని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇవి శరీరంలోకి ప్రవేశించాక అప్పటికే ఉన్న యాంటీబాడీలను ఏమార్చుతాయని, ఈ దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కరోనా వ్యాక్సిన్ పనితీరు పైనా ప్రభావితం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. వ్యాక్సిన్ సజావుగా పనిచేసేందుకు ఈ నూతన స్ట్రెయిన్ ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తున్నారు.

కాగా, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కు 501Y.V2గా నామకరణం చేశారు. ఇది మొదటగా దక్షిణాఫ్రికాలోని ఈస్ట్రన్ కేప్ ప్రావిన్స్ నెల్సన్ మండేలా బే ఏరియాలో ఉనికిని చాటుకుంది. ఈ నూతన రకం స్ట్రెయిన్ లో ఉండే స్పైక్ ప్రొటీన్ జన్యు ఉత్పరివర్తనాలను కలిగివుండడం వల్ల, వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మార్పు చెందిన స్పైక్ ప్రొటీన్ రిసెప్టర్ లో ఉండే మూడు ఉత్పరివర్తనాలు మానవ కణాల్లో కరోనా క్రిముల ప్రవేశాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపారు.

కరోనా కణంలోని ఈ స్పైక్ ప్రొటీన్ ను లక్ష్యంగా చేసుకుని తయారైన వ్యాక్సిన్లు... దక్షిణాఫ్రికా రకం కరోనా కణాల్లోని స్పైక్ ప్రొటీన్ ను దెబ్బతీయలేకపోవచ్చని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.

More Telugu News