West Bengal: మమతకు మరో షాక్.. మంత్రి రాజీబ్ రాజీనామా
- ఆమోదించిన బెంగాల్ గవర్నర్
- అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న రాజీబ్
- తృణమూల్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆమె కేబినెట్ లోని మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా చేశారు. అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను మమతకు పంపించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తర్వాత గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ వద్దకు వెళ్లిన రాజీబ్.. రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. రాజీవ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
రాజీనామా తర్వాత ఆయన ఫేస్ బుక్ లోనూ స్పందించారు. ప్రతి ఒక్కరూ నాకు కుటుంబంతో సమానమని, అందరి మద్దతుతోనే ఎంత దూరమైనా వెళ్లగలిగానని కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి అన్నారు. అయితే, తదుపరి కార్యాచరణ ఏంటన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు.
కాగా, ఇటీవల తృణమూల్ కు భారీ దెబ్బలు తగులుతున్నాయి. సువేందు అధికారితో మొదలైన షాక్ లు.. రాజీబ్ వరకు వచ్చాయి. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్.. బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కారణం, గురువారం ఆయన సువేందు అధికారి, నటి, బీజేపీ నేత రిమ్జిమ్ మిత్రతో సమావేశమయ్యారు. రెండ్రోజుల క్రితం తృణమూల్ నేత అరిందమ్ భట్టాచార్య కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.