Karnataka: ఆ ప్రాంతంలో ఇంకా మరికొన్ని డైనమైట్లు.. శివమొగ్గలో మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశం!

8 Killed in Karnataka Stone Crushing Quarry

  • ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసిన అధికారులు
  • ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం
  • క్వారీ కాంట్రాక్టర్ సహా ఇద్దరి అరెస్ట్
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఘటనపై అధికారులు ఓ ప్రకటన చేశారు. ప్రమాదంలో 8 మంది చనిపోయారని చెప్పారు. శుక్రవారం ఉదయం హునసొడుకు వెళ్లిన అధికారులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే రాళ్ల క్వారీలో నిలిపి ఉంచిన లారీ లోడ్ డైనమైట్లు ఒక్కసారిగా పేలాయని తెలిపారు. అసలు ఆ లారీ లోడ్ డైనమైట్లను ఎందుకు తెప్పించారన్నది ఇంకా తెలియలేదన్నారు.

ఘటనకు సంబంధించి స్టోన్ క్రషింగ్ కాంట్రాక్టర్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంపై ఇప్పటికే అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్నారు.

సదరు ప్రాంతంలో మరిన్ని లైవ్ డైనమైట్లున్నాయని, మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశమూ లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేశామని, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సాయం తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

ప్రమాదం ఘటన తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులందరికీ కర్ణాటక ప్రభుత్వం కావాల్సిన సాయం అందిస్తోందని అన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా లోతైన విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News