India: ప్రార్థనాలయాల పరిరక్షణ గురించి పాక్​ మాట్లాడడం విడ్డూరం: ఐరాసలో భారత్​

  • ఈ మధ్యే అక్కడ ఓ గుడిని తగులబెట్టారని మండిపాటు
  • పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం
  • శాంతి విలసిల్లాలంటే పక్షపాత ధోరణి విడనాడాలని సభ్య దేశాలకు సూచన
India slams Pakistan at UN assembly says ironic of Pak to discuss protection of religious sites

ప్రార్థనాలయాల పరిరక్షణ గురించి పాకిస్థాన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని భారత్ ఎద్దేవా చేసింది. ఐక్యరాజ్యసమితి 75వ సాధారణ సమావేశాల సందర్భంగా ఇతర దేశాలతో కలిసి పాకిస్థాన్ ప్రవేశపెట్టిన శాంతి సంస్కృతిపై ప్రచారం, ప్రార్థనాలయాల పరిరక్షణ తీర్మానంపై ఐరాసలో మన దేశ ప్రతినిధి స్పందించారు. ఓ వైపు దాడులకు పాల్పడుతూనే పాక్ ఇలాంటి తీర్మానాలు పెట్టడం పెద్ద విడ్డూరమని అన్నారు.

‘‘పాకిస్థాన్ లో ఎప్పుడూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యే గతేడాది డిసెంబర్ లోనే అక్కడి కరక్ లో ఉన్న ఓ గుడిపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టారు. స్థానిక పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకోలేదు. ఆ దాడికి మద్దతుగా నిలిచారు. మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కులనూ పాక్ కాలరాస్తోంది. అలాంటి దేశమా ఇప్పుడు శాంతి సంస్కృతి, ప్రార్థనాలయాల రక్షణ గురించి మాట్లాడేది? ఇలాంటి తీర్మానాలు పాక్ లాంటి దేశాలకు రక్షణ కవచంలా ఉండకూడదు’’ అని ఆయన పాక్ పై మండిపడ్డారు.

ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసహనం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రార్థనాలయాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాలపైనే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. బమ్యన్ బుద్ధ విగ్రహంపై జరిగిన దాడి తాలూకు చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. అఫ్గానిస్థాన్ లోని సిక్ గురుద్వారాపై జరిగిన బాంబు దాడిలో 25 మంది సిక్కులు చనిపోయారని గుర్తు చేశారు. పాక్ లో అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని అన్నారు.

మతం గురించి చర్చించాలంటే పక్షపాత ధోరణిని విడనాడాలని, ఒక దేశంవైపే ఉండి మాట్లాడకూడదని ఆయన అన్నారు. పక్షపాతం చూపించి, ఒకవైపే ఉండి మాట్లాడితే ప్రపంచంలో ఎప్పుడూ శాంతి విరాజిల్లదని ఆయన తేల్చి చెప్పారు. మత విశ్వాసాలను కాపాడడంలో తామెప్పుడూ ముందే ఉంటామని స్పష్టం చేశారు. ప్రార్థనాలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకు ప్రార్థనాలయాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 ఉందని గుర్తు చేశారు.

More Telugu News