America: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ జీతమెంతో తెలుసా?
- భారత కరెన్సీలో నెలకు రూ. 5 లక్షలు
- ఇతర ఖర్చుల కోసం 50 వేల డాలర్లు
- రిటైర్ అయితే పింఛనుగా 2 లక్షల డాలర్లు
అమెరికా వంటి అగ్రదేశానికి 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ జీతభత్యాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడి వేతనం నెలకు భారత కరెన్సీలో దాదాపు రూ. 5 లక్షలు (7,114 డాలర్లు). ఇక, ఇతరత్రా ఖర్చులకు 50 వేల డాలర్లు, విందు వినోదాలకు ఏడాదికి 19 వేల డాలర్లు లభిస్తాయి. రిటైరయ్యాక ఏడాదికి పింఛను కింద 2 లక్షల డాలర్లను భత్యంగా చెల్లిస్తారు. ఇవి కాకుండా లభించే అదనపు వసతులు చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి.
వీటిలో మొదటిది ఎయిర్ ఫోర్స్ వన్ విమానం.. బోయింగ్ 747-200బి జెట్ విమానం. అధ్యక్షుడి అధికారిక పర్యటనల కోసం దీనిని వినియోగిస్తారు. ఇలాంటివి రెండు విమానాలు అందుబాటులో ఉంటాయి. మూడు అంతస్తులు, 100 మంది కూర్చోవచ్చు. ఈ విమానం గంటసేపు ప్రయాణిస్తే 2 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. ఈ విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఇది కాకుండా మెరీన్ వన్ అనే హెలికాప్టర్, అత్యాధునిక బీస్ట్ అనే కారు కూడా అందుబాటులో ఉంటుంది.
వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా అవెన్యూ 1600గా పిలిచే వైట్‌హౌస్ అధ్యక్షుడి ఇల్లే కాకుండా కార్యాలయం కూడా. 1800వ సంవత్సరంలో దీనిని నిర్మించారు. 132 గదులున్నాయి. ఇందులోని వంటగది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. 42 మంది కూర్చుని వీక్షించేలా ఓ హోం థియేటర్ ఉంది. అధ్యక్షుడి కుటుంబంతోపాటు 100 మంది ఇతర సిబ్బంది ఉంటారు. వైట్‌హౌస్‌పై ప్రభుత్వం ఏడాదికి 40 లక్షల డాలర్లు ఖర్చు చేస్తుంది.