VK Sasikala: శశికళకు కరోనా పాజిటివ్.. విడుదల ఆలస్యం కానుందా?
- అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ
- ఈ నెల 27న జైలు నుంచి విడుదల
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న దినకరన్
- ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో ఐసీయూలో చికిత్స
ఈ నెల 27న జైలు నుంచి విడుదల కావలసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. మరికొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు బుధవారం ఆమెను లేడీ క్యూరోజోన్ ఆసుపత్రికి తరలించారు.
ఆమెలో జ్వరం, వెన్నునొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించడంతో నిన్న ఆమెకు కరోనా అనుమానంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. ఇందులో నెగటివ్ అని తేలింది. దీంతో అనుమానించిన వైద్యులు ఈసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శశికళ ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు 80కి పడిపోవడంతో వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలిసిన ఆమె మేనల్లుడు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బెంగళూరు చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అందిన సమాచారం ప్రకారం, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. వైద్యులు ఆమెను చక్కగా చూసుకుంటున్నారని అన్నారు. వచ్చే వారం ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడామె కరోనా బారినపడడంతో విడుదల ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.