Elephants: అంతరిక్షం నుంచి ఏనుగుల మదింపు!

  • ఉపగ్రహ చిత్రాలతో లెక్కిస్తున్న బ్రిటన్ పరిశోధకులు
  • మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో చిత్రాల విశ్లేషణ
  • ఒక్క రోజులోనే 5 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేయొచ్చని వెల్లడి
Elephants counted from space for conservation

ప్రస్తుతం వన్యప్రాణుల సంఖ్యను తెలుసుకోవడానికి వాటి పాదముద్రలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. వాటి ఆధారంగానే అవి ఎన్ని ఉన్నాయో లెక్కిస్తున్నారు. అయితే, తొలిసారిగా అంతరిక్షం నుంచి లెక్కించే కార్యక్రమానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. అంటే, అంతరిక్షం నుంచి తీసిన అటవీ లేదా ఇతర ప్రాంతాల చిత్రాల ఆధారంగా వాటి సంఖ్యను తేల్చనున్నారు.

అందులో భాగంగా ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బాత్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు.. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఆఫ్రికన్ ఏనుగులను గణిస్తున్నారు. భూమికి 600 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న భూ పరిశీలనా ఉపగ్రహం తీసిన ఫొటోలను విశ్లేషిస్తున్నారు. వీటి ద్వారా ఒక్క రోజులోనే 5 వేల చదరపు కిలోమీటర్లలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో లెక్కించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉపగ్రహ చిత్రాల పరిశీలన కోసం మెషీన్ లెర్నింగ్ ను వినియోగిస్తున్నారు. ఏవి ఏనుగులో మెషీన్ గుర్తుపట్టేలా కంప్యూటర్ ప్రోగ్రామ్ ను తయారు చేశామని, దీని వల్ల ఉపగ్రహ చిత్రాల్లో మనం కంటితో గుర్తించలేని చిన్న చిన్న విషయాలనూ సులువుగా తెలుసుకోవచ్చని వివరిస్తున్నారు.

దీని ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్రమ వేటనూ అరికట్టవచ్చని చెబుతున్నారు. ఒక్క ఏనుగులనే కాకుండా మిగతా జంతువులనూ లెక్కించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే, దీని కోసం ఉపగ్రహ చిత్రాలపై తమకూ యాక్సెస్ ఇవ్వాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులు కోరుతున్నారు. ఆ ఫొటోలు కావాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.

More Telugu News