ECI: మజ్లిస్​ పార్టీకి పెరుగుతున్న విరాళాలు!

  • ఒక్కో హెలికాప్టర్ ప్రయాణానికి రూ.3 లక్షల చొప్పున డొనేషన్లు
  • ఎన్నికల సంఘానికి ఇచ్చిన విరాళాల నివేదికలో వెల్లడి
  • నివేదిక సమర్పించని టీఆర్ ఎస్ పార్టీ
  • వైఎస్ఆర్ సీపీకి రూ.8.9 కోట్ల విరాళాలు
  • టీడీపీకి కేవలం రూ.2.6 కోట్లు
MIM flying high TRS skips donor list reveals EC report

విరాళాలు పొందడంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ దూసుకుపోతోంది. ప్రధాన పార్టీలకు దీటుగా ఆ పార్టీకీ జోరుగా విరాళాలు అందుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి ఎక్కువయ్యాయి కూడా. భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించిన విరాళాల నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి.

ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతటా పార్టీని విస్తరించేందుకు అసదుద్దీన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పార్టీ పాగా వేసింది. ఝార్ఖండ్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్ లోనూ ఐదు సీట్లు గెలిచి చక్రం తిప్పింది. బెంగాల్ ఎన్నికల్లోనూ అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మంచి గుర్తింపు కూడా వచ్చింది.

ఇక గుర్తింపుతో పాటే డబ్బులూ వస్తున్నాయి. 2019–2020 మధ్య తమ స్టార్ క్యాంపెయినర్లు హెలికాప్టర్లలో ప్రయాణించడానికి విరాళాలు అందాయని ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ లో మజ్లిస్ పేర్కొంది. ఒక్కో రైడ్ కు రూ.3 లక్షల చొప్పున నాలుగు రైడ్ లకు రూ.12 లక్షల విరాళాలు అందాయని చెప్పింది. మహ్మద్ నజీబుద్దీన్ ఖాన్, ఇంథిఖాబ్ అన్సారీ, ఝార్ఖండ్ కు చెందిన రియాజ్ షరీఫ్, ముంబైకి చెందిన అలావుద్దీన్ అన్సారీల హెలికాప్టర్ ప్రయాణాలకు విరాళాలు వచ్చాయని తెలిపింది.

అయితే, టీఆర్ఎస్ మాత్రం కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ను సమర్పించలేదు. ఇక, ఏపీలో వైఎస్ఆర్ సీపీ, తెలుగు దేశం పార్టీలకు 2018–19తో  పోలిస్తే బయటి నుంచి వచ్చిన విరాళాలు తగ్గాయి. వైఎస్ఆర్ సీపీకి రూ.8.9 కోట్ల మేర విరాళాలొస్తే.. టీడీపీకి రూ.2.6 కోట్లే వచ్చాయి.

టీడీపీకి ఎక్కువగా చెన్నైకి చెందిన ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే విరాళాలు సమకూరాయి. ట్రస్ట్ కోటి రూపాయలు ఇచ్చింది. పబ్లిషర్ వేమూరి బలరామ్, ఆయన నడుపుతున్న అనిల్ స్వాతి బలరాం ఫౌండేషన్ కలిపి రూ.కోటి, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 లక్షలు విరాళాలుగా ఇచ్చాయి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబులూ పార్టీకి విరాళమిచ్చారు.

వైఎస్ఆర్ సీపీకి అత్యధికంగా జేఎస్ఆర్ ఇన్ ఫ్రా నుంచే రూ.రెండున్నర కోట్ల విరాళాలు అందాయి. నెల్లూరుకు చెందిన శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి రూ. కోటి ఇచ్చారు. ఐబీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, యునైటెడ్ టెలీ లింక్స్ వంటి సంస్థలూ తమ వంతు సాయం అందించాయి.

More Telugu News