NITI AAYOG: ఆవిష్కరణల సూచీలో తెలంగాణకు నాలుగో స్థానం.. ఏపీకి ఏడో ర్యాంకు

  • పాయింట్లు పెరిగినా మారని తెలంగాణ ర్యాంకు
  • మొదటి స్థానాన్ని పదిలపరుచుకున్న కర్ణాటక
  • మూడో ర్యాంకు నుంచి రెండో ర్యాంకుకు వచ్చిన మహారాష్ట్ర
  • భారత ఆవిష్కరణల సూచీ 2020ని విడుదల చేసిన నీతిఆయోగ్
Telangana retains fourth spot on Innovation Index

ఆవిష్కరణలు, భావి సాంకేతికతల విషయంలో తెలంగాణ లీడర్ అని మరోసారి నిరూపించింది. ఆవిష్కరణల్లో దేశంలోనే నాలుగో ర్యాంకును సాధించింది. బుధవారం నీతిఆయోగ్ విడుదల చేసిన భారత ఆవిష్కరణ సూచీ 2020 ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2019లో 22.06గా ఉన్న స్కోరును 2020లో 33.23కు పెంచుకున్న రాష్ట్రం మరోసారి నాలుగో స్థానంలోనే నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 24.19 పాయింట్లతో ఏడో ర్యాంకు సాధించి టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.

నిజానికి టీ హబ్, వీ హబ్ వంటి పరిశ్రమల ఇంక్యుబేటర్లతో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడంలో తెలంగాణ సర్కారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందే ఉంది. కానీ, 2019లోనూ నాలుగో స్థానంలోనే నిలిచిన తెలంగాణ.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలను దాటి ముందుకెళ్లలేకపోయింది. గత ఏడాది దారుణంగా విఫలమైన విభాగాల్లో ఈ సారి మెరుగుదల కనిపించినా.. మిగతా విభాగాల్లో మాత్రం మరింత దారుణంగా పతనమైంది. దీంతో ఈసారి ర్యాంకు పెరగలేదు.

జాబితాలో కర్ణాటక తన మొదటి ర్యాంకును కాపాడుకుంది. 42.5 పాయింట్లతో మొదటి స్థానాన్ని సంపాదించింది. 2019లో మూడో స్థానం సంపాదించిన మహారాష్ట్ర.. ఇప్పుడు తమిళనాడును వెనక్కు నెట్టి రెండో ర్యాంకులోకి దూసుకొచ్చింది. తమిళనాడు రెండో ర్యాంకు నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది. కేరళ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకు సాధించింది.

అయితే, నాలెడ్జ్ అవుట్ పుట్, నాలెడ్జ్ డిఫ్యూషన్  అనే రెండు విభాగాలుగా.. వాటిని సమర్థంగా నడిపించే మానవ వనరులు, పెట్టుబడులు, నిపుణులైన ఉద్యోగులు, వ్యాపార వాతావరణం, భద్రత, న్యాయ సాయం వంటి విషయాల ప్రాతిపదికన నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చింది.

నాలెడ్జ్ అవుట్ పుట్, నాలెడ్జ్ డిఫ్యూషన్ లో గత ఏడాది నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా..  2020లో రెండు, నాలుగో ర్యాంకులకు తెలంగాణ మెరుగుపడింది. ఆ రెండింటిని నడిపే ఐదు ఉప విషయాల విషయంలోనూ గత ఏడాది 9వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం.. 7వ ర్యాంకుకు చేరింది. అయితే, భద్రత, న్యాయ సాయం, మానవ వనరులు, పెట్టుబడుల వంటి విషయాల్లో మాత్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడింది.

పెట్టుబడులకు మంచి విధానాలు రూపొందిస్తోందని పేరున్నా.. ఈ విషయంలో ర్యాంకు మాత్రం పడిపోయింది. 2019లో ఏడో స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు 8వ ర్యాంకుకు దిగజారింది. భద్రత, న్యాయ సాయం వంటి విషయాల్లో 16వ స్థానం నుంచి 9వ స్థానానికి వచ్చినప్పటికీ, మొత్తం ర్యాంకు మారడానికి మాత్రం ఇవేమీ ఉపయోగపడలేదు.

More Telugu News