America: శ్వేతజాతి ఆధిపత్యాన్ని ప్రతిఘటిద్దాం.. ఒకరినొకరు గౌరవించుకుందాం: తొలి ప్రసంగంలో బైడెన్

biden attracted americans in his first speach

  • అధికారం కోసం కాకుండా అమెరికన్ల కోసం పనిచేస్తా
  • ప్రజాస్వామ్యం విజయం సాధించిందనే ఈ వేడుక
  • దేశాన్ని మరోమారు అగ్రగామిగా నిలపడంలో మీ సాయం కావాలి
  • హారిస్ ప్రమాణం దేశంలో మార్పులకు సంకేతం
  • సమయం లేదు, ఇప్పుడే పని ప్రారంభిద్దాం

అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ తొలి ప్రసంగంలోనే అమెరికన్లను ఆకట్టుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం కోసం కాకుండా అమెరికన్ల కోసం పనిచేస్తానన్నారు. గత నాలుగేళ్ల పాలనలో అంతర్జాతీయ సమాజంతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తానని, దేశాన్ని మరోమారు అగ్రగామిగా నిలపడంలో తనకు సహాయ సహకారాలు అందించాలని దేశ ప్రజలను కోరారు. శ్వేతజాతి ఆధిపత్యాన్ని ప్రతిఘటిద్దామని అన్నారు.

కేపిటల్ భవనం వద్ద రెండు వారాల క్రితం జరిగిన హింసను కూడా బైడెన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది ఒక వ్యక్తి సాధించిన విజయం కాదని, ప్రజాస్వామ్యం గెలుపొందినందుకు ఈ రోజు ఇక్కడ మనం వేడుక నిర్వహించుకుంటున్నామని అన్నారు.

ప్రజాస్వామ్యం విలువైనది, సున్నితమైనది అని మరోమారు తెలుసుకున్నామని బైడెన్ అన్నారు. ప్రజాస్వామ్యం విజయం సాధించి, ప్రజల సంకల్పం నెరవేరిందని అన్నారు. కేపిటల్ భవన పునాదులను కదిలించే ప్రయత్నం జరిగినా అంతా ఒక్క తాటిపై  నిలిచి ఒక దేశంగా నిలబడ్డామని బైడెన్ అన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆశలు చిగురించిన రోజని నూతన అధ్యక్షుడు బైడెన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

తాను అందరినీ సమానంగానే చూస్తానని, తనకు ఓటు వేసిన వారు, వేయని వారంటూ భేదాలు ఏమీ ఉండబోవని, వివక్షకు తావుండదని బైడెన్ హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అమెరికన్లు అందరూ తనతో చేతులు కలపాలని కోరారు. ఐక్యంగా ఉంటే ఎప్పటికీ విఫలం కాబోమని అన్నారు. మొత్తం 21 నిమిషాలపాటు ప్రసంగించిన బైడెన్ కరోనాతో మృతి చెందిన అమెరికన్లకు నివాళిగా కొన్ని క్షణాలపాటు మౌనం పాటించారు.

ఒకరినొకరు గౌరవించుకుందామని, కమలా హారిస్ ప్రమాణం చేయడం దేశంలోని మార్పులకు సంకేతమని బైడెన్ ఉద్ఘాటించారు. ఐక్యంగా ఉండి కరోనాపై విజయం సాధిద్ధామని, ఇక ఏమాత్రం సమయాన్ని వృథా చేయొద్దని, వెంటనే పని మొదలుపెట్టాలని బైడెన్ పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News