Andhra Pradesh: త్వరలోనే బీజేపీలోకి సినీ నటి అర్చన.. సోము వీర్రాజుతో భేటీ

Actress Archana meets AP BJP Chief Somu Veerraju
  • బీజేపీకి పెరుగుతున్న సినీ గ్లామర్
  • అర్చన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంస
  • మర్యాదపూర్వక భేటీయేనన్న బీజేపీ ఏపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు సీనియర్ సినీ నటి అర్చనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన  అర్చన 1988, 1989లలో రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె బహుముఖ ప్రతిభాశాలి అని, రాజమండ్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసినట్టు వీర్రాజు తెలిపారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే సినీ గ్లామర్‌తో నిండిపోయిన బీజేపీలోకి మరింత మంది వచ్చి చేరుతున్నారు.

ఇటీవల చెన్నైలో వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌ను కలిసిన బీజేపీ నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మంచి పదవులు ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా, అర్చనను సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh
BJP
Somu Veerraju
Actress Archana

More Telugu News