Donald Trump: వచ్చీ రాగానే 15 కీలక ఉత్తర్వులపై బైడెన్ సంతకం.. అన్నీ ట్రంప్ విధానాలకు వ్యతిరేకమే!
- మరికొన్ని గంటల్లో బైడెన్ ప్రమాణ స్వీకారం
- తొలి రోజే కీలక ఉత్తర్వులపై సంతకాలు
- మెక్సికో గోడ నిర్మాణానికి అడ్డుకట్ట
- అమెరికాకు ముస్లింల రాకపై ఉన్న నిషేధాజ్ఞల ఎత్తివేత
అమెరికాలో ట్రంప్ శకం ముగిసింది. మరికొన్ని గంటల్లో అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బైడెన్ అధికారం చేపట్టిన తొలిరోజే కీలకమైన 15 కీలక ఉత్తర్వులపై సంతకాలు చేయబోతున్నారు. వీటిలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నవే అత్యధికం కావడం గమనార్హం.
అన్నింటికంటే ముఖ్యంగా ట్రంప్ నిర్మిస్తున్న మెక్సికో గోడ. ఆ దేశం నుంచి చొరబాట్లను ఆపేందుకు సరిహద్దు వద్ద గోడ నిర్మించనున్నట్టు అధికారంలోకి వచ్చిన కొత్తలో ట్రంప్ ప్రకటించారు. అన్నట్టే గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. బైడెన్ అధ్యక్షుడిగా విధులు చేపట్టిన వెంటనే ఈ గోడ నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే, ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో పర్యటించకుండా ఉన్న నిషేధాజ్ఞలను కూడా బైడెన్ ఎత్తివేయనున్నారు.
వీటి తర్వాత కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలను బైడెన్ ప్రకటించనున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 100 రోజులపాటు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయడం వాటిలో ఒకటి. అలాగే, పారిస్ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థల్లో భాగస్వామిని చేసే ఉత్తర్వులపైనా బైడెన్ సంతకాలు చేయనున్నారు. వీటితోపాటు వలస విధానం, వీసాలు వంటి వాటిపైనా నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తానికి బైడెన్ రాకతో అమెరికాలో పెను మార్పులు జరగబోతున్నాయి.