West Godavari District: పూళ్ల గ్రామంలో 28కి చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య‌

active cases reches to 28 in poola village
  • స్పృహ తప్పి పడిపోతోన్న స్థానికులు
  • నీటి కాలుష్యమే కారణం?
  • కూరగాయలపై వాడే పురుగుల‌ మందే కార‌ణ‌మన్న అనుమానం
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో వింతవ్యాధి కలకలం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఆ మండలంలోని పూళ్ల గ్రామంలో కొంద‌రు స్పృహ తప్పి పడిపోతుండ‌డంతో బాధితుల‌కు ఆసుప‌త్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు మ‌రో ఇద్ద‌రు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో బాధితుల సంఖ్య 28కు చేరిందని అధికారులు తెలిపారు.

కాగా, ఈ వ్యాధి కారణం ఏమిటో తెలియక అక్కడి ప్ర‌జ‌లు ఆందోళన చెందుతున్నారు. నీటి కాలుష్యం కానీ, లేదా అక్క‌డి ప్ర‌జ‌లకు అందుతోన్న కూరగాయలపై వాడే పురుగుల మందువల్ల వారు అస్వ‌స్థ‌త‌కు గురి అవుతుండొచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. ఇప్ప‌టికే వాటి శాంపిల్స్ ను తీసుకుని పరీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

వాటి రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ వింత వ్యాధి ఏంటో తెలుస్తుందని వివ‌రించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్నారు. గోరు వెచ్చ‌ని నీరు తాగాల‌ని, కూర‌గాయాలు శుభ్రం చేసి వండుకోవా‌లని సూచిస్తున్నారు. గ‌తంలోనూ ఏలూరులో వింత వ్యాధితో వంద‌ల మంది ఆసుప‌త్రుల పాలైన విష‌యం తెలిసిందే.
West Godavari District
Andhra Pradesh

More Telugu News