Sania Mirza: నాకు కరోనా సోకినప్పుడు కుటుంబాన్ని మళ్లీ ఎప్పుడు చూస్తానో అని భయపడ్డాను: సానియా మీర్జా

  • ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడ్డాను
  • ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకింది
  • రెండేళ్ల కొడుకుకు దూరంగా ఉండటం ఎంతో బాధించింది
Sania Mirza reveals she had contracted Corona virus

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడ్డానని తెలిపింది. తను పాజిటివ్ అని తెలియగానే కుటుంబానికి, కుమారుడికి దూరంగా స్వీయ నిర్బంధంలో గడిపానని... ఇది చాలా కష్టం అనిపించిందని చెప్పింది. తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

'ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన ఘటనలను పంచుకుంటున్నాను. నాకు కరోనా సోకింది. భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. అయితే నాకు కరోనా లక్షణాలు ఎక్కువగా లేకపోవడం అదృష్టం. రెండేళ్ల నా కుమారుడికి, కుటుంబానికి దూరంగా స్వీయ నిర్బంధంలో ఉండటం మాత్రం నన్ను ఎంతగానో బాధించింది. కరోనా సోకిన వారు వారి కుటుంబాలకు దూరంగా ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉండటాన్ని ఊహించుకోలేము.

ప్రతి రోజు కరోనాకు సంబంధించి కొత్తకొత్త విషయాలు వినాల్సి వస్తుందనే భయం కలుగుతుంటుంది. ప్రతిరోజు మనలో కొత్త లక్షణం కనిపిస్తుంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొడుకుని, కుటుంబసభ్యులను ఎప్పుడు చూస్తానో అనే భయం నాలో ఉండేది. కరోనా వైరస్ సామాన్యమైనది కాదు. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ నాకు సోకింది. మన కుటుంబాన్ని, స్నేహితులను కాపాడుకోవడానికి మనం ఎన్ని చేయాలో అన్నీ చేయాలి. మాస్కులు వేసుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి. అందరం కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలి' అని సానియా మీర్జా తెలిపింది.

More Telugu News