Tandav: బేషరతు క్షమాపణలు చెప్పిన 'తాండవ్' నటీనటులు, యూనిట్!
- 'తాండవ్'పై వెల్లువెత్తిన విమర్శలు
- హిందూ దేవతలను అవమానించారని కేసులు
- ఎవరి మనోభావాలనూ దెబ్బతీయలేదన్న యూనిట్
ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న రాజకీయ నేపథ్య సీరీస్ 'తాండవ్'పై విమర్శలు వెల్లువెత్తుతూ, దీన్ని నిషేధించాలన్న డిమాండ్ వస్తున్న వేళ, చిత్ర యూనిట్, నటీ నటులు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
ఇప్పటికే ఈ సిరీస్ లో హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచే సీన్లు ఉన్నాయని పలు రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో, తాము ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని చూడలేదని, ఎవరి మనసునైనా నొప్పిస్తే, బేషరతు క్షమాపణలు కోరుకుంటున్నామని సదరు సీరీస్ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
'తాండవ్' కేవలం ఫిక్షన్ మాత్రమేనని, జీవించివున్న, మరణించిన ఏ వ్యక్తికి, జరిగిన సంఘటనలకు సంబంధం లేదని, ఏదైనా సంబంధం కనిపిస్తే, అది కేవలం యాదృచ్ఛికమేనని పేర్కొంది. ఏ వ్యక్తి, కులం, మతం, వర్గం ప్రజల నమ్మకాలను, మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం లేదని, ఏ రాజకీయ పార్టీకీ తమ కథతో సంబంధం లేదని ఈ ప్రకటన స్పష్టం చేసింది.
కాగా, తాజా ఘటనల తరువాత అమెజాన్ ప్రైమ్ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖ వివరణ కోరిన నేపథ్యంలో ఈ క్షమాపణలు రావడం గమనార్హం. 'తాండవ్' వెబ్ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, మహమ్మద్ జీషాన్, ఆయుబ్ తదితరులు నటించగా, సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఇది రూపొందింది.