Tirumala: రథసప్తమి రోజు దర్శన టోకెన్లు ఉంటేనే తిరుమలకు అనుమతి!
- తిరుమలలో రద్దీ సాధారణం
- రథసప్తమి నాడు ఏడు వాహనాలపై స్వామి దర్శనం
- మాడ వీధుల్లో ఊరేగింపు ఉంటుందన్న టీటీడీ
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. చలి వాతావరణం అధికంగా ఉండటం, స్కూళ్లు ప్రారంభం కావడంతో, వారాంతంతో పోలిస్తే రద్దీ తగ్గిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సోమవారం నాడు స్వామివారిని సుమారు 38 వేల మందికి పైగా దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం లభించింది.
ఇక త్వరలో రానున్న రథసప్తమి వేడుకల సందర్భంగా ఉదయం నుంచి స్వామివారు ఏడు రకాల వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారని, అయితే, ఆ రోజున దర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే తిరుమలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. టోకెన్లు లేని భక్తులకు కొండపైకి ప్రవేశం లేదని అన్నారు. కరోనా తరువాత తొలిసారిగా మాడ వీధుల్లో స్వామి ఊరేగింపు ఉంటుందని, భక్తులకు ఏర్పాట్లపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.