Somu Veerraju: డీజీపీని తొలగించాలని కోరుతున్నాం: సోము వీర్రాజు
- పాస్టర్లకు జీతాలు ఇచ్చే వాళ్లే మతతత్వవాదులు
- బీజేపీపై డీజీపీ నిరాధార ఆరోపణలు చేశారు
- వెల్లంపల్లి గతంలో ఆలయాల కూల్చివేతలపై ఉద్యమం చేశారు
బీజేపీ మతతత్వ పార్టీ కాదని... హిందుత్వ అనేది మతం కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చర్చ్ లు కడుతూ, పాస్టర్లకు జీతాలు ఇచ్చే వాళ్లే మతతత్వవాదులు అని విమర్శించారు. తిరుమలలో ఇద్దరు మంత్రులు క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
ఆలయాల విధ్వంసానికి సంబంధించి డీజీపీ నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. ఈ ఘటనల వెనుక బీజేపీ వ్యక్తుల హస్తం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. డీజీపీని విధుల నుంచి తొలగించాలని కోరుతున్నామని అన్నారు.
ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి గతంలో బీజేపీలో ఉన్నప్పుడు ఆలయాల కూల్చివేతలపై ఉద్యమం కూడా చేశారని... ఇప్పుడు వైసీపీలోకి వెళ్లి మాట మార్చారని సోము వీర్రాజు విమర్శించారు. చర్చిలు, మసీదులు కడితే రాని మత విద్వేషాలు... ఆలయాల కోసం తాము పాదయాత్ర చేస్తే వస్తాయా? అని ప్రశ్నించారు.
ఆలయాల నిధులను వాడుకోవడం, ప్రజల డబ్బుతో చర్చ్ లు కట్టడం వంటి వాటిపై ప్రశ్నిస్తే మతతత్వం అని అంటారని చెప్పారు. ఆలయాలను రక్షించలేని దేవాదాయ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము చంద్రబాబు ట్రాప్ లోకి వెళ్లమని... ఆయనే తమ ట్రాప్ లోకి రావాలని అన్నారు.