Bhuma Akhila Priya: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను మరోసారి తిరస్కరించిన సికింద్రాబాద్ కోర్టు

  • బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్
  • బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ
  • అనారోగ్య రీత్యా బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది
  • అదనపు సెక్షన్లు మోపామన్న పోలీసులు
  • పోలీసులతో ఏకీభవించిన న్యాయస్థానం
Secunderabad court denies bail for Akhilapriya

ప్రవీణ్ రావు అనే వ్యక్తిని, అతని ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసును విచారిస్తున్న సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇవాళ విచారణ చేపట్టారు. అయితే, అఖిలప్రియపై  అదనపు సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు మెమో దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమని సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది.

ఇప్పటికే అఖిలప్రియను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే, అఖిలప్రియ ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమెను విడుదల చేస్తే ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె భర్త, ఇతరులు దొరక్కపోవచ్చని, ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు.

పోలీసుల వాదనతో ఏకీభవించిన సికింద్రాబాద్ కోర్టు... ఈ కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసినందున తాము బెయిల్ ఇవ్వలేమని, పై కోర్టుకు వెళ్లాలంటూ అఖిలప్రియకు సూచించింది. ఈ నేపథ్యంలో, నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది నిర్ణయించుకున్నారు.

More Telugu News