Corona Virus: కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు... కొందరు 140 రోజుల్లోపే చనిపోతున్నారంటున్న బ్రిటన్ అధ్యయనం!

  • ఓఎన్ఎస్ తో కలిసి లీసెస్టర్ వర్సిటీ అధ్యయనం
  • కరోనా నుంచి కోలుకున్నా మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నారని వెల్లడి
  • దీర్ఘకాలంలో గుండె పనితీరు దెబ్బతింటోందన్న పరిశోధకులు
  • మధుమేహం, కాలేయ, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వివరణ
Leicester University study on post Covid fatality

ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా రక్కసి ఇంకా తన ఉనికి చాటుకుంటూనే ఉంది. మరోవైపు అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన లీసెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కొవిడ్ ప్రభావం నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు 140 రోజుల్లోపే చనిపోతున్నారట.

ఒక్కసారి కరోనా బారినపడితే వారిలో దీర్ఘకాలంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ముఖ్యంగా గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు, కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడో వంతు మంది ఐదు నెలల్లోపే మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. లీసెస్టర్ షైర్ వర్సిటీ, ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి.

కొవిడ్ తొలి దశ వ్యాప్తి సమయంలో 47,780 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా, వారిలో 29.4 శాతం మంది 140 రోజుల్లోనే మళ్లీ ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు తలెత్తాయని, 12.3 శాతం మంది మృత్యువాత పడ్డారని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నా గానీ, తర్వాత రోజుల్లో హృదయ సంబంధ సమస్యలతో పాటు డయాబెటిస్, దీర్ఘకాలిక కాలేయ, కిడ్నీ సమస్యల బారినపడుతున్నారని వివరించారు.

దీనిపై లీసెస్టర్ వర్సిటీకి చెందిన కమలేశ్ కుంతీ అనే ప్రొఫెసర్ (ప్రైమరీ కేర్ డయాబెటిస్, వాస్క్యులర్ మెడిసన్) మాట్లాడుతూ, ఇది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన కరోనా బాధితులపై నిర్వహించిన అతి పెద్ద అధ్యయనం అని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి ఆరోగ్యవంతుల్లా ఇంటికి వెళుతున్నా మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్న కేసులు అధికంగా కనిపించాయని తెలిపారు. ఇలాంటి కేసుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నామని అన్నారు.

More Telugu News