Farooq Abdullah: పుస్తకావిష్కరణ సభలో ఫరూక్ అబ్దుల్లా 'ముద్దు'ముచ్చట!
- కరోనా భయంతో భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోతున్నా
- ఇక, ఆలింగనం సంగతి సరేసరి
- టీకా అభివృద్ధిలో భారత్ విజయం
జమ్మూలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కరోనా వైరస్ కారణంగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను చెప్పి అందరినీ నవ్వించారు. కరోనా భయంతో తన భార్యకు ముద్దు పెట్టేందుకు కూడా భయపడ్డానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సభికులు పడిపడీ నవ్వారు. వైరస్ భయంతో చేతులు కలపలేకపోతున్నామని, ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకోలేకపోతున్నామని ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా భయంతో ముద్దే కాదు, చివరికి తన భార్యను ఆలింగనం కూడా చేసుకోలేకపోతున్నానని చెప్పారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో మరింత నవ్వు తెప్పిస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియపై అబ్దుల్లా మాట్లాడుతూ.. టీకాను అభివృద్ధి చేయడంలో భారత్ విజయం సాధించిందని కొనియాడారు.