Indian Railways: కోటి రూపాయల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రైల్వేశాఖ ఉన్నతాధికారి
- సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసు
- రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి మహేందర్ సింగ్ అరెస్ట్
- రైల్వే కాంట్రాక్ట్‌లు ఇప్పించేందుకు లంచం
సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద లంచావతారాన్ని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌లో ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి (ఐఆర్ఈఎస్) అయిన మహేందర్‌సింగ్ చౌహాన్‌ను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది. ఆయన కోటి రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్‌లో మరిన్ని ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లను ఇప్పించేందుకు గాను ఆయన ఈ లంచాన్ని తీసుకున్నట్టు సీబీఐ తెలిపింది.
గతంలోనూ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినప్పటికీ ఇది మాత్రం సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసని అధికారులు తెలిపారు. మహేందర్ సింగ్ రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్ 1985 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ హెడ్‌క్వార్టర్స్ అయిన గువాహటిలోని మాలిగావ్‌లో పోస్టింగులో ఉన్నారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిన్న సీబీఐ దేశ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్ సహా దేశంలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.
కాగా, నకిలీ బిల్లుల క్లియరన్స్ కేసులో సీబీఐ గతేడాది నలుగురు అధికారులపై కేసులు నమోదు చేసింది. వీరు కూడా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందినవారే కావడం గమనార్హం. ప్రైవేటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌లతో కుమ్మక్కై బిల్లులను మార్చేసి వీరంతా భారీ మోసానికి పాల్పడినట్టు సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. రూ.1.80 కోట్ల అసలు బిల్లుకు ముందు ఒకటి అంకెను చేర్చడం ద్వారా దానిని రూ. 11.80 కోట్లుగా మార్చడం, మరో బిల్లుకు ముందు ఒకటి అంకెను చేర్చి రూ. 12.92 కోట్లుగా మార్చినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు, మొత్తంగా 8 బిల్లులను మార్చినట్టు సీబీఐ గుర్తించింది.