Farmers: రైతు నిరసనల్లో ఉన్న నేతలు, నటులు సహా 40 మందికి ఎన్ఐఏ సమన్లు!
- 50 రోజులకు పైగా రైతుల నిరసనలు
- పలువురిని విచారణకు పిలిచిన ఎన్ఐఏ
- జాబితాలో బలదేవ్ సింగ్, దీప్ సింధు తదితరులు
కేంద్రం గత సంవత్సరం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీ సరిహద్దుల్లో గడచిన 50 రోజులకు పైగా నిరసనలు తెలుపుతున్న వారిలో దాదాపు 30 మందికి ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సమన్లు జారీ చేసింది. వీరిలో రైతు సంఘం నేత బలదేవ్ సింగ్ రిస్సా, పంజాబీ నటుడు దీప్ సింధు తదితరులు కూడా ఉన్నారు. వీరికి నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 160 కింద నోటీసులు జారీ అయ్యాయి. వీరందరినీ న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించించింది.
ఈ విషయాన్ని ఎన్ఐఏ ఇన్ స్పెక్టర్ ధీరజ్ కుమార్ స్పష్టం చేస్తూ, లోధీ రోడ్డులోని సీజీఓ కాంప్లెక్స్ లో వీరిని విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు. రైతు నిరసనల వెనుక ఉన్న కొన్ని అరాచకశక్తుల గురించి ఆరా తీసేందుకే నోటీసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఇక తనకు అందిన నోటీసులను దీప్ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.