Mamata Banerjee: బెంగాల్ లో అందరికీ టీకా ఇవ్వాలనుకుంటున్నాం... ఖర్చెంతో చెప్పండి ఇస్తాం!: మమతా బెనర్జీ
- భారత్ లో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్
- మొదట అత్యవసర సేవల సిబ్బందికి టీకాలు
- బెంగాల్ కు సరిపడా డోసులు పంపాలని మమత విజ్ఞప్తి
- ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడి
భారత్ లో తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ లో ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య సిబ్బంది వంటి ముందు వరుస యోధులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. దశల వారీగా దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. అయితే పశ్చిమ బెంగాల్ లో అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే కాకుండా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నామని, అందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తామని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.
ఎవరి ప్రాణం అయినా విలువైనదేనని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తో ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బెంగాల్ కు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఖర్చుకు వెనుకాడేది లేదని మమత పేర్కొన్నారు.