India Fan: సిడ్నీ మైదానంలో జాతి వివక్షకు గురయ్యానంటూ ఓ భారత ప్రేక్షకుడి ఫిర్యాదు

  • ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఆటగాళ్లపై జాతి వివక్ష
  • సిడ్నీ మైదానంలో తాను అవమానానికి గురయ్యానన్న ప్రేక్షకుడు
  • తనను భద్రతాసిబ్బంది అడ్డుకున్నారని వెల్లడి
  • తనకు న్యాయం కావాలని డిమాండ్
Indian man complains against a security official of SCG

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు జాత్యహంకార వ్యాఖ్యలకు గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియన్లు భారత క్రికెటర్లనే కాదు, ప్రేక్షకుల్లో ఉన్న భారతీయులను కూడా వదలడంలేదు. సిడ్నీ టెస్టు సందర్భంగా కృష్ణకుమార్ అనే వ్యక్తి తాను జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసింది మైదానంలోని భద్రతాధికారి అని కృష్ణకుమార్ వెల్లడించాడు. సిడ్నీ టెస్టు చివరిరోజున ఈ ఘటన జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ సీజీ) అధికారులు విచారణ ప్రారంభించారు.

ఆ భద్రతాధికారి చర్యలు తనను తీవ్ర అవమానానికి గురిచేశాయని కృష్ణకుమార్ ఆరోపించాడు. జాతివివక్ష వద్దని చెప్పేలా నాలుగు బ్యానర్లను మైదానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడమే తాను చేసిన నేరమా అని ఆవేదన వ్యక్తం చేశాడు. వాటిలో ఒక బ్యానర్ నిర్దేశిత పరిమాణం కంటే పెద్దదిగా ఉందని తనను మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వాపోయాడు. ఓ భద్రతాధికారి దారుణంగా వ్యవహరిస్తూ, "జాతి వివక్ష గురించి మాట్లాడాలనుకుంటే నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడకి వెళ్లి మాట్లాడుకో" అని దురహంకారపూరితంగా మాట్లాడాడని వివరించాడు.

పైగా ఆ బ్యానర్లను తాను కారులో ఉంచి తిరిగొచ్చేటప్పటికి మరింత ఎక్కువగా సిబ్బందిని మోహరించి తనను నఖశిఖ పర్యంతం శోధించారని, పైగా తాను మరో భాష ఉపయోగిస్తానేమో అని ఓ భారత సంతతికి చెందిన మహిళా గార్డును కూడా పిలిపించారని కృష్ణకుమార్ తెలిపాడు. ఇది కచ్చితంగా తన జాతీయతను ఎత్తిచూపే ప్రయత్నమేనని, మైదానంలో కూడా తనకు అభిముఖంగా ఓ అధికారి నిలుచున్నాడని వెల్లడించాడు. తనకు న్యాయం కావాలని, జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నానని, అందుకే ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు

More Telugu News