Tata Motors: టెస్లాతో భాగస్వామ్యంపై స్పష్టత నిచ్చిన టాటా మోటార్స్

  • భారత మార్కెట్లో అడుగుపెడుతున్న టెస్లా
  • టాటా మోటార్స్ తో చేతులు కలుపుతుందంటూ ప్రచారం
  • వెల్కమ్ టెస్లా అంటూ టాటా మోటార్స్ ట్వీట్
  • భారీస్థాయిలో ఊహాగానాలు రావడంతో వెనక్కితగ్గిన టాటా
  • వ్యూహాత్మక భాగస్వామ్యం లేదని వెల్లడి
Tata Motors clarifies over rumors about strategic partnership with Tesla

భారత్ లో రంగప్రవేశం చేసేందుకు అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఉవ్విళ్లూరుతోంది. అయితే, భారత్ వంటి అతి పెద్ద మార్కెట్లో ఒంటరిగా బరిలో దిగడం పట్ల ఆలోచన చేస్తున్న టెస్లా యాజమాన్యం... టాటా మోటార్స్ వంటి దిగ్గజంతో భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. టాటామోటార్స్ కు చెందిన విద్యుత్ వాహనాల విభాగం ఎలక్ట్రిక్ మొబిలిటీ కూడా దీనిపై సానుకూల సంకేతాలు ఇవ్వడంతో భారత్ లో టెస్లా-టాటా మోటార్స్ భాగస్వామ్యం ఖాయమైనట్టేనని అందరూ భావించారు.

అయితే, తాజాగా టాటా మోటార్స్ తమ వైఖరిని స్పష్టం చేసింది. టెస్లాతో భాగస్వామ్యంపై ఊహాగానాలకు కారణమైన ట్వీట్లను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించింది. టెస్లాతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నదంతా అవాస్తవం అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇటీవలే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలతో టెస్లాతో భాగస్వామ్యంపై అందరూ ఓ అంచనాకు వచ్చారు. వెల్కమ్ టెస్లా, టెస్లా ఇండియా అంటూ హ్యాష్ ట్యాగ్ లతో టాటా మోటార్స్ ట్వీట్ చేసింది. కంపెనీ నిర్ణయం ఏమో గానీ ఊహాగానాలే బలంగా వ్యాపిస్తుండడంతో ఆ ట్వీట్ ను టాటామోటార్స్ తొలగించి, జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.

More Telugu News