Rajnath Singh: కరోనా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోంది.. ఎగుమతి చేస్తాం: రాజ్ నాథ్ సింగ్

  • సర్వేజనా సుఖినోభవంతు అనేది మన సిద్ధాంతం
  • కరోనా వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు కూడా అందిస్తాం
  • మహమ్మారిని మోదీ సవాల్ గా తీసుకుని అదుపులో ఉంచారు
Will export Covid vaccine says Rajnath Singh

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ హితం కోసం వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తామని చెప్పారు. సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని మనం నమ్ముతామని... అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకు మనుషులతో పాటు సర్వ జంతుజాలం పట్ల ఇదే కరుణను చూపిస్తున్నామని అన్నారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో కూడా మన సిద్ధాంతాలను అనుసరిస్తూ వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు కూడా అందిస్తామని చెప్పారు.

కరోనా వల్ల ఒక్క రోజులోనే ప్రతి ఒక్కటీ మూత పడుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని రాజ్ నాథ్ అన్నారు. మహమ్మారిని మన ప్రధాని మోదీ ఒక సవాల్ గా తీసుకున్నారని... వరుస సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచారని కితాబిచ్చారు. వైరస్ ను పరీక్షించేందుకు తొలుత మన దేశంలో కేవలం రెండు ల్యాబ్ లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు వేలాది ల్యాబ్ లు ఉన్నాయని, ఇది మామూలు విషయం కాదని అన్నారు. తొలుత పీపీఈ కిట్లు, మాస్క్ లు, వెంటిలేటర్ల కొరత ఉండేదని... ఇప్పుడు మెడికల్ సేఫ్టీ కిట్లను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లక్నోలో కొత్తగా నిర్మించనున్న సెంట్రల్ కమాండ్ హాస్పిటల్ కు ఈరోజు రాజ్ నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News