Raghu Rama Krishna Raju: రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన రఘురాజు.. అందరూ ఇవ్వాలని విన్నపం!
- భూమి పూజ రోజున రూ. 3.9 లక్షల విరాళం ఇచ్చిన రఘురాజు
- ఈరోజు భక్తులతో కలిసి రూ. 1,11,111 విరాళం
- ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విన్నపం
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి వారి ఆలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావాలనే భక్తిభావనతో ఎంతో మంది విరివిగా తమ విరాళాలను ఇస్తున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూ. 5,00,100 విరాళాన్ని ఇచ్చారు. గుజరాత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఏకంగా రూ. 11 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఇదే మాదిరి ఎందరో భారీ విరాళాలను ఇస్తున్నారు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తన వంతుగా విరాళాన్ని అందించారు. అయోధ్య రామ మందిరం భూమి పూజ రోజున తన మూడు నెలల జీతం రూ. 3.9 లక్షలను విరాళంగా ఇచ్చానని రఘురాజు తెలిపారు. ఈరోజు భక్తులతో కలిసి రూ. 1,11,111 ఇచ్చానని చెప్పారు.
అయోధ్య రామాలయాన్ని నిర్మించుకోవాలనే శతాబ్దాల నాటి కలను నిజం చేసుకుంటున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళాలను ఇవ్వాలని కోరారు. ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు విరాళం ఇవ్వాలని అన్నారు. విరాళం రూ. 100 కావచ్చు లేదా రూ. 10 లక్షలు కావచ్చని... ఎంత ఇచ్చాం అనే దాని కంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములం కావడమే అత్యంత విలువైనదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళాలను పంపించేందుకు అవసరమైన వివరాలను షేర్ చేశారు.