Gajendra Singh Shekhawat: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే ఇవ్వండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖ

  • ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు
  • గతేడాది అపెక్స్ కౌన్సిల్ భేటీ
  • కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రం వెల్లడి
  • డీపీఆర్ లు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టీకరణ
  • తన లేఖలోనూ అదే విషయాన్ని ప్రస్తావించిన షెకావత్
Shekawat writes to Telugu states Chief Ministers

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే సమర్పించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. అక్టోబరు 6 నాటి అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం అమలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పరం ఫిర్యాదు చేశాయి. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులతో కేంద్ర జలవనరుల శాఖ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబరు 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించారు. ఏపీ, తెలంగాణ చేపట్టే కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి షెకావత్ ఆ భేటీలో స్పష్టం చేశారు. కృష్ణా నదిపై 8, గోదావరి నదిపై 7 ప్రాజెక్టులకు డీపీఆర్ లు ఇవ్వాలని పేర్కొన్నారు. డీపీఆర్ లు సహా అన్ని అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

ఏపీ గురించి చెబుతూ... కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిబంధనల మేరకు డీపీఆర్ ఇవ్వాలని అన్నారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్ ఇవ్వాలని గోదావరి బోర్డు కోరిన విషయాన్ని షెకావత్ ప్రస్తావించారు. పురుషోత్తపట్నం మినహా ఒక్క ప్రాజెక్టుకూ పూర్తి డీపీఆర్ ఇవ్వలేదని తెలిపారు.

తాజాగా రాసిన లేఖలో ఆయన ఇదే అంశాన్ని ఎత్తిచూపారు. తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్ కూడా రాలేదని, ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కూడా డీపీఆర్ లు ఇవ్వాలని షెకావత్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు రెండు రాష్ట్రాలు నడుచుకోవాలని హితవు పలికారు. డీపీఆర్ లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. గత నెల 11న తెలంగాణ సీఎం తనను కలిశారని, గత నెల 16న ఏపీ సీఎం కలిశారని, కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి తన లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News