AP DGP: ఏపీ డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు

TDP and BJP fires on AP DGP

  • ఆలయాలపై దాడుల వెనుక పార్టీలు ఉన్నాయన్న డీజీపీ
  • ఒక డీజీపీ ఇలా ఫేక్ గా మాట్లాడవచ్చా? అన్న బండారు
  • డీజీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్న మాధవ్

ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని అని చెప్పిన డీజీపీ ఇప్పుడు మాట మార్చి దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని అంటున్నారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మండిపడ్డారు. ఒక డీజీపీ ఎలాంటి వివరాలు లేకుండా ఇలా ఫేక్ గా మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ ను చదవడమే డీజీపీ పని అని విమర్శించారు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ, బీజేపీలకు డీజీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, విగ్రహాలను ధ్వంసం చేయడంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ఏ సమాచారంతో డీజీపీ చెప్పారని ప్రశ్నించారు. సీఐడీ, సిట్ ఇచ్చిన సమాచారంతో చెప్పారా? లేక సజ్జల ఇచ్చిన సమాచారంతో చెప్పారా? అని నిలదీశారు. 13వ తేదీన మాట్లాడుతూ ఈ అంశంతో ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పిన డీజీపీ... ఇప్పుడు పార్టీలకు సంబంధం ఉందని చెపుతున్నారని... ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. డీజీపీకి హైందవ మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని నేరస్తుడిలా కనిపించలేదా? అని ప్రశ్నించారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ, టీడీపీ కుట్ర ఉందని డీజీపీ ఎలా చెపుతారని మండిపడ్డారు. ఒక వైసీపీ నేత మాదిరి డీజీపీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ మాత్రం సిగ్గు లేకుండా డీజీపీ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలపై పోలీసులు చేస్తున్న దాడులు పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు.

AP DGP
Gautam sawang
Bandaru Satyanarayana
Varla Ramaiah
MLC Madhav
Telugudesam
BJP
YSRCP
Jagan
Sajjala Ramakrishna Reddy
  • Loading...

More Telugu News