Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళాలు కుమ్మరించిన వజ్రాల వ్యాపారులు

  • రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభం
  • తొలి విరాళం ఇచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
  • రూ.11 కోట్ల విరాళం ఇచ్చిన వజ్రాల వ్యాపారి డోలాకియా
  • భారీగా విరాళాలు రావడంతో హిందుత్వ వాదుల్లో ఉత్సాహం
Huge donations for Ayodhya Ram Mandir construction

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాళాల పర్వం షురూ కాగా, గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారులు కోట్ల రూపాయల విరాళాలు అందిస్తూ రాముడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. సూరత్ కు చెందిన ప్రముఖ వజ్రాల విక్రేత గోవింద్ భాయ్ డోలాకియా ఏకంగా రూ.11 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అంతేకాదు, సూరత్ లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయానికి వెళ్లి స్వయంగా విరాళం తాలూకు చెక్ ను అందించారు.

ఆయనే కాదు, సూరత్ కు చెందిన మహేశ్ కబూతర్ వాలా రూ.5 కోట్లు ఇవ్వగా, లవ్ జీ బాద్షా రూ.1 కోటి విరాళంగా అందించారు. ప్రారంభంలోనే భారీగా విరాళాలు రావడం పట్ల హిందుత్వ వాదుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, రామమందిరం నిర్మాణానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విరాళం అందించారు. రూ.5 లక్షల 100 రూపాయల చెక్ ను ఆయన రామజన్మభూమి ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్ పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ లకు అందించారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొత్తం రూ.1,100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ గతంలో పేర్కొంది. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణానికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ విరాళాల ద్వారా రూ.100 కోట్లకు పైగా సమకూరాయి. తాజాగా, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాల సేకరణకు తెరలేపారు. అన్ని వర్గాల వారి నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.

More Telugu News