Hayan Tree: తప్పుడు రివ్యూ ఇచ్చి రెస్టారెంటు కొంపముంచిన యూట్యూబర్

Negative review by Youtuber led to restaurant shutdown

  • రెస్టారెంటుకు వెళ్లిన ఫుడ్ బ్లాగర్
  • వంటకాలకు మెతుకులు అంటుకున్నాయని ఆరోపణ
  • తినగా మిగిలినవి వడ్డిస్తున్నారని ఆగ్రహం
  • రెస్టారెంటుపై నెగెటివ్ రివ్యూ ఇచ్చిన వైనం
  • వైరల్ గా మారిన రివ్యూ
  • రెస్టారెంటు మూసివేత

దక్షిణ కొరియాకు చెందిన హయన్ ట్రీ ఓ ఫుడ్ బ్లాగర్. రెస్టారెంట్లు, హోటళ్లను సందర్శిస్తూ అక్కడి వంటకాలపై యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అయితే, ఓ రెస్టారెంటు విషయంలో దారుణంగా పొరబడిన హయన్ ట్రీ తప్పుడు రివ్యూ ఇవ్వడమే కాకుండా, ఆ రెస్టారెంటు మూసివేతకు కారణమయ్యాడు.

వివరాల్లోకెళితే.... ఇటీవల డయగు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంటుకు వెళ్లాడు. అయితే అక్కడి ఆహారపదార్థాల్లో అన్నం మెతుకులు కనిపించాయి. అవి ఇతరులు తినగా మిగిలిన ఆహార పదార్థాలని, వాటినే మళ్లీ వడ్డిస్తున్నారని అనుకున్నాడు. కస్టమర్లను ఈ విధంగా మోసం చేస్తున్నారని భావించి రెస్టారెంటుపై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.

హయన్ ట్రీ యూట్యూబ్ చానల్ కు 7 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. రెస్టారెంటుపై రూపొందించిన వీడియోను యూట్యూబ్ చానల్లో పోస్టు చేయగా, కొద్ది వ్యవధిలోనే సోషల్ మీడియా అంతటా పాకిపోయింది. దాంతో ఆ రెస్టారెంటుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇది అధికారుల వరకు వెళ్లడంతో డయగులోని ఆ రెస్టారెంటును మూసివేయక తప్పలేదు. ఆ రెస్టారెంటు యాజమాన్యం హయన్ ట్రీ వీడియోపై స్పందించినా ఫలితం లేకపోయింది. తాము తాజా ఆహార పదార్థాలనే వడ్డిస్తామని, అందుకు వీడియో ఫుటేజి సాక్ష్యమని మొత్తుకున్నా ఎవరూ వినలేదు.

అయితే కొన్నిరోజుల తర్వాత రెస్టారెంటు ఫుటేజి వీడియోని హయన్ ట్రీ వీక్షించాడు. వాస్తవం ఏంటో అప్పుడు గానీ అతడికి బోధపడలేదు. తన ప్లేటులోని మెతుకులే ఇతర ఆహార పదార్థాలకు అంటుకున్నాయని గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాప పడ్డాడు. జరిగిన పొరపాటుకు ఆ రెస్టారెంటు యాజమాన్యానికి క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించాడు. సారీ చెబుతూ మరో వీడియో పోస్టు చేశాడు. అయితే ఈసారి అతడి సబ్ స్క్రైబర్లే అతడిపై మండిపడ్డారు. తమను తప్పుదోవ పట్టించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, వేల సంఖ్యలో అతడి యూట్యూబ్ చానల్ నుంచి అన్ సబ్ స్క్రైబ్ చేశారు.

ఏదేమైనా యూట్యూబర్ల విశ్వసనీయతపై ఈ ఉదంతం పలు సందేహాలను లేవనెత్తుతోంది. ఇటువంటి తప్పుడు రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లను నియంత్రించేలా తగిన నిబంధనలు రూపొందించాలని సదరు రెస్టారెంట్ యాజమాన్యం దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని కోరింది.

  • Loading...

More Telugu News