Police: సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసిన పోలీసులు
- విగ్రహాలు ఫేక్ అంటూ ప్రచారం
- బెంగళూరు గో-సిప్స్ అనే యూట్యూబ్ చానెల్ లో విద్వేష వ్యాఖ్యలు
- పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
- గుంటూరుకు చెంది వ్యక్తి ఫిర్యాదుతో చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాలు ఫేక్ అంటూ ప్రచారం చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, ఎన్నో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశానని ప్రవీణ్ చేసిన పోస్టులు కలకలం రేపుతున్నాయి. దేవుళ్ల విగ్రహాలపై అతను ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు గో-సిప్స్ అనే యూట్యూబ్ చానెల్ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తానే స్వయంగా దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నింటిని ధ్వంసం చేయించానని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి వ్యాఖ్యలను తాము సహించబోమని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేశామని వివరించారు. పబ్లిసిటీ కోసం పాస్టర్ పోస్టులు పెడుతున్నారని తెలిపారు.