Tesla: భారత్ లో తమ ప్రణాళికలపై రెండు ముక్కల్లో క్లారిటీ ఇచ్చిన టెస్లా అధినేత
- విద్యుత్ కార్ల తయారీలో పేరెన్నికగన్న టెస్లా
- భారత మార్కెట్లో ప్రవేశానికి టెస్లా సన్నాహాలు
- బెంగళూరులో కార్యాలయం రిజిస్ట్రేషన్
- చెప్పినట్టుగానే వస్తున్నాం అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్
అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ కార్ల తయారీలో పేరుగాంచిన టెస్లా త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశించనుంది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో సూచనప్రాయంగా తెలిపారు. 2021లో భారత్ లో తమ ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. అయితే, తాజాగా తన ట్వీట్ తో భారత్ లో విద్యుత్ కార్లను ఇష్టపడేవారికి మరింత నమ్మకం కలిగించారు. అసలు, ఆయన తాజా ట్వీట్ చేయడం వెనుక ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.
బెంగళూరులో భారీస్థాయిలో కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు టెస్లా వర్గాలు రిజిస్ట్రేషన్ చేయించినట్టు వెల్లడైంది. భారత్ తో ఘనంగా ప్రవేశించేందుకు టెస్లా సన్నద్ధమవుతోందంటూ టెస్లా అభిమానుల సైట్ ఓ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ "చెప్పినట్టుగానే వస్తున్నాం" అంటూ భారత్ లో తమ ప్రవేశంపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
కాగా, మధ్యతరగతి, బలహీన వర్గాలు అధికంగా ఉండే భారత్ లో టెస్లా వంటి ఖరీదైన కార్ల తయారీ సంస్థ ఏ విధంగా వ్యాపారం చేస్తుందన్న దానిపై సందేహాలు వస్తున్నాయి. దీనిపై టెస్లా ఫ్యాన్ సైట్ టెస్మానియన్ డాట్ కామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. భారత్ లో టెస్లా సంపన్న వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుందని వివరించింది. 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత్ లో 85 మిలియన్ల మంది టెస్లా కారు కొనుగోలు చేసే స్తోమత ఉన్నవారిగా భావిస్తున్నట్టు తెలిపింది.