ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్' రేపే ప్రారంభం

14-01-2021 Thu 14:49
  • మూడు సినిమాలు చేస్తున్న ప్రభాస్ 
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'
  • రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం  
Prabhas Salar film will start tomorrow

ఇప్పుడు ప్రభాస్ నటించనున్న మూడు సినిమాలూ వేటికవే ప్రత్యేకతలు.. విశేషాలూ కలిగివున్నాయి. ఓమ్ రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' .. ఈ మూడూ కూడా భారీ చిత్రాలే.. పాన్ ఇండియా సినిమాలే. ఇక వీటిలో కన్నడ దర్శకుడు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆమధ్య రిలీజవడంతో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగును రేపు కనుమ రోజున ఉదయం 11 గంటలకు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ ముహూర్తం విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో యశ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని తెలిపారు.

యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందే 'సలార్'లో నటించే కథానాయిక ఎవరన్నది ఇంకా వెల్లడికాలేదు. ఆ విషయంతో పాటు ఇతర నటీనటుల వివరాలను కూడా రేపు ప్రకటించే అవకాశం వుంది. ఇదిలావుంచితే, ప్రభాస్ నటించనున్న మరో రెండు సినిమాల షూటింగులు కూడా త్వరలోనే మొదలవుతాయని సమాచారం.