అమ్మాయిలు 15 ఏళ్ల‌కే పిల్ల‌ల్ని క‌న‌గ‌ల‌రు.. పెళ్లి వ‌య‌సు పెంచొద్దు: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వ్యాఖ్య‌లు

14-01-2021 Thu 11:58
  • 18 ఏళ్ల‌కి వారు పెళ్లి చేసుకోవ‌చ్చు
  • 21 ఏళ్ల‌కు పెళ్లి వ‌య‌సు పెంచ‌డం ఎందుకు?
  • 18 ఏళ్ల త‌ర్వాత మెట్టినింటికి వెళ్లి సంతోషంగా ఉండాలి
 dont increase marriage age says congress leader

అమ్మాయిల పెళ్లి వ‌య‌సుపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌ సీనియర్ నేత‌‌, మాజీ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆడపిల్లలు 15 ఏళ్ల వ‌య‌సునుంచే పిల్ల‌ల్ని క‌న‌గ‌లుగుతార‌ని అలాంట‌ప్పుడు వారి  వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకని ప్ర‌శ్నించారు.  

ఇది తాను చెబుతున్న మాట కాద‌ని వైద్యుల నివేదిక ప్రకారం 15 ఏళ్ల‌ వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా మార‌తార‌ని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకోవడానికి తగినంత పరిణతి చెందుతారని అన్నారు. ఈ కార‌ణంగానే ఆడ‌పిల్ల‌ల‌ వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారని ఆయ‌న తెలిపారు.

అలాంట‌ప్పుడు ఇప్పుడు కొత్త‌గా వారి వివాహ వ‌య‌సును 18 నుంచి 21కి పెంచడమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఏమైనా వైద్యుడా?  శాస్త్రవేత్తా? అని ఆయ‌న నిల‌దీశారు. ఆడపిల్ల‌లు 18 ఏళ్లు దాటగానే మెట్టినింటికి వెళ్లి సంతోషంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా సంఘాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.