ఫ‌స్ట్ నైట్ రోజే ఉరి వేసుకున్న పెళ్లి కొడుకు!

14-01-2021 Thu 10:47
  • నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఘ‌ట‌న‌
  • మేనమామ కూతురుతో ఇటీవ‌లే పెళ్లి
  • ఫ‌స్ట్ నైట్ రోజు బ‌య‌ట‌కు వెళ్లిన వ‌రుడు
  • పూరి గుడిసెలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌ 
groom commits suicide

ఎన్నో ఆశ‌ల‌తో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే, ఏమైందో తెలియ‌దు గానీ, ఫ‌స్ట్ నైట్ రోజే ఉరి వేసుకుని త‌నువు చాలించాడు ఆ యువ‌కుడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు ఇటీవ‌ల ఆయ‌న‌ మేనమామ కూతురుతో పెళ్లి జ‌రిగింది. పెళ్లి జ‌రిగి 11 రోజులు అవుతుండ‌డంతో కుటుంబ‌ సంప్రదాయం ప్ర‌కారం 11వ రోజున కుటుంబ స‌భ్యులు ఫ‌స్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే, ఏదో బాధ‌తో ఉన్న సోమేశ్‌ తన ఫ్రెండ్స్ ద‌గ్గ‌రికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ‌లేదు,‌ ఇంటికి రాలేదు.

రాత్రంతా ఎదురుచూసిన వధువు, కుటుంబ స‌భ్యులు ఉద‌యాన్నే ఆయ‌న కోసం వెత‌క‌డం ప్రారంభించారు. సోమేశ్ స్నేహితులను వారు అడిగారు. రాత్రి త‌మ వ‌ద్ద‌కు వచ్చి వెళ్లి పోయాడ‌ని వారు చెప్పారు.  కుటుంబ స‌భ్యులంద‌రూ సోమేశ్ కోసం వెతికారు. చివ‌ర‌కు ఓ పూరి గుడిసెలో ఉరివేసుకుని విగ‌త జీవిగా సోమేశ్ క‌న‌ప‌డ్డాడు. దీనిపై పోలీసుల‌కు కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.