భవిష్యత్తులో సాధారణ జలుబుగా మారిపోనున్న కరోనా: అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

14-01-2021 Thu 09:52
  • వైరస్ ఎండమిక్‌గా మారాక తగ్గనున్న తీవ్రత
  • జలుబు కారక వైరస్‌లు ఎంతోకాలంగా వున్నాయి 
  • నాలుగు వైరస్ రకాలపై జరిపిన పరిశోధనలో వెల్లడి 
Corona virus becomes flu in future

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి భవిష్యత్తులో సాధారణ జలుబుగా మిగిలిపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాండమిక్‌గా ఉన్న కరోనా.. ఎండమిక్‌గా మారిన తర్వాత దాని తీవ్రత తగ్గిపోతుందని తాజా పరిశోధన ఒకటి అంచనా వేసింది. సార్స్ కోవ్-1తోపాటు మరో నాలుగు వైరస్ రకాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కరోనా వైరస్ సాధారణ ప్రజల్లో విస్తృతంగా వ్యాపించిన తర్వాత ఇది సాధారణ జలుబుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ జలుబుకు కారణమయ్యే కరోనా వైరస్‌లు ఎంతోకాలంగా వ్యాప్తిలో ఉన్నాయని, ప్రతి ఒక్కరు చిన్నతనంలోనే వాటి బారినపడి ఉంటారని పేర్కొన్నారు.

చిన్నారులకు సాధారణంగా సోకే ఇన్ఫెక్షన్ల వల్ల రోగనిరోధకశక్తి లభిస్తుందని, భవిష్యత్తులో వచ్చే తీవ్ర రోగాలను సమర్థంగా ఎదుర్కోవడంలో ఇది పనిచేస్తుందని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెన్నీ లావైన్ తెలిపారు. అయితే, అప్పుడప్పుడు సంభవించే రీ ఇన్ఫెక్షన్లను మాత్రం ఇది నియంత్రించలేదన్నారు.