జాన్వీ కపూర్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న రైతులు!

14-01-2021 Thu 09:44
  • పంజాబ్ లో జరుగుతున్న షూటింగ్ లో జాన్వీ
  • తమకు మద్దతు తెలపాలని వచ్చిన రైతులు
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన జాన్వీ కపూర్
Farmers Stop Janvi Kapoor Shooting in Punjab

దేశ రాజధాని సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గడచిన 50 రోజులకు పైగా నిరసనలు తెలుపుతున్న రైతులు తాజాగా, పంజాబ్ లో జరుగుతున్న జాన్వీ కపూర్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారు. జాన్వీ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతున్న వేళ ఆ ప్రాంతానికి వెళ్లిన రైతులు షూటింగ్ కు అంతరాయం కలిగించారు. తక్షణం జాన్వీ కపూర్ మీడియా ముందుకు వచ్చి, తాను రైతులకు మద్దతుగా ఉంటానని ప్రకటించాల్సిందేనని పట్టుబట్టారు.

ఆపై షూటింగ్ సిబ్బంది జాన్వీతో ప్రకటన ఇప్పిస్తామని రైతులకు హామీని ఇవ్వగా, వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తరువాత తన ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ ఓ ప్రకటన విడుదల చేసింది. "రైతన్నలు దేశానికి గుండెకాయ వంటివారు. దేశానికి ఆహారాన్ని అందించడంలో వారి పాత్రను నేను గుర్తిస్తాను, ఎంతో విలువ ఇస్తాను. సాధ్యమైనంత త్వరలోనే రైతులకు లబ్ది కలిగించే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను" అని జాన్వీ పేర్కొంది.

కాగా, షూటింగ్ ను అడ్డుకునేందుకు వచ్చిన రైతులు, తమకు ఇంతవరకూ ఏ బాలీవుడ్ నటీ నటులుగానీ, నిర్మాతలుగానీ మద్దతు పలకలేదని ఆరోపించినట్టు సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్తా తెలిపారని స్థానిక పోలీసు అధికారి బల్వీందర్ సింగ్ పేర్కొన్నారు. ఆపై తాను జాన్వీ చేత ప్రకటన ఇప్పిస్తానని ఆయన చెప్పిన తరువాతనే నిరసనకారులు శాంతించారని అన్నారు. ప్రస్తుతం జాన్వీ, 'గుడ్ లక్ జెర్రీ' పేరిట నిర్మితమవుతున్న చిత్రంలో నటిస్తోంది.