టీటీడీలో అవినీతి రహిత పరిపాలన కొనసాగుతోంది: మోహన్ బాబు కితాబు

14-01-2021 Thu 09:30
  • మంచు ల‌క్ష్మితో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న మోహ‌న్ బాబు
  • ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
  • భోగి మంట‌ల్లో క‌రోనా వైర‌స్ భస్మమైపోయిందని వ్యాఖ్య
no corruption in ttd sasy mohan babu

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ( టీటీడీ)లో అవినీతి రహిత పరిపాలన కొనసాగుతోందని సినీన‌టుడు మోహన్ బాబు కితాబునిచ్చారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కూతురు మంచు ల‌క్ష్మితో క‌లిసి ఈ రోజు ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకుని, తీర్థ ప్ర‌సాదాలు స్వీకరించారు.

ఈ సంద‌ర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్న‌ట్లు తెలిపారు. భోగి మంట‌ల్లో క‌రోనా వైర‌స్ భస్మమైపోయిందని వ్యాఖ్యానించారు. 'ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు చెప్పేముందు.. గడిచిపోయిన కాలం మళ్లీ రాకూడదు, రాకూడదు. అంటే 2020 నుండి ఇంకా మనల్నందర్నీ వదలకుండా ఉండే కరోనా అతి తొందరలో భస్మమైపోవాలని, మనం అందరం క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అంటూ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

కాగా, సంక్రాంతి సంద‌ర్భంగా పలువురు రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు శ్రీవారిని ద‌ర్శించుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.