Hyderabad: రూ. 90 కోట్ల రుణం ఇప్పిస్తామని.. రూ. 20 లక్షలు నొక్కేసిన కేటుగాళ్లు!

  • ప.గో.లో పేపర్ కంపెనీ నిర్వహిస్తున్న నాగేశ్వరరావు
  • నష్టాలు రావడంతో బ్యాంకు రుణం కోసం యత్నం
  • రూ. 20 లక్షలు ముంచిన సవేర ఏజెన్సీస్
Savera Agency cheated a man Rs 20 lakhs

బ్యాంకు నుంచి 90 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తానని చెప్పి, ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు నొక్కేశారు కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రమంజిల్‌కు చెందిన నాగేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పేపర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే, వ్యాపారంలో నష్టం రావడంతో రుణం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో మాదాపూర్‌కు చెందిన సవేర ఏజెన్సీస్ నిర్వాహకులైన నాగరాజు, లీలాకాంత్, చింతేశ్వరరావు తదితరులను సంప్రదించారు.

తమకు రూ. 20 లక్షలు ఇస్తే రూ. 90 కోట్ల రుణం ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. దీంతో నాగేశ్వరరావు వారు అడిగినంత సమర్పించుకున్నారు. అనంతరం ఆయనకు రుణం మంజూరైనట్టు గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ నుంచి నకిలీ మంజూరీ పత్రాన్ని ఇచ్చారు. అయినప్పటికీ రుణం మంజూరు కావడంలో ఆలస్యం అవుతుండడంతో మోసపోయినట్టు గ్రహించిన నాగేశ్వరరావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News