ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోలేదో.. జాగ్రత్త: హెచ్చరించిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

14-01-2021 Thu 08:35
  • ధ్వంసమైన విగ్రహాన్ని సందర్శించిన ఎంపీ
  • లక్షలాదిమందితో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
  • ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందని ఎద్దేవా
TDP MP Rammohan Naidu warns YCP Govt

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని నిన్న పరిశీలించిన రామ్మోహన్‌నాయుడు అనంతరం మాట్లాడుతూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే లక్షలాదిమంది కార్యకర్తలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రాన్ని ఎంతోమంది పాలించారని, కానీ ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని రామ్మోహన్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభమైందన్నారు. ఇప్పుడు దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాలపై  పడి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.